logo

కవల పిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి

ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది.

Published : 30 Apr 2024 02:10 IST

ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన

భర్త జగన్‌తో శాంతి, కవల పిల్లలు

బోరబండ, న్యూస్‌టుడే: ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది.   వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ ఆమె బంధువులు మోతీనగర్‌ ప్రాంతంలోని పద్మప్రియ హాస్పిటల్‌ వద్ద సోమవారం ఆందోళన చేపట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మృతురాలి భర్త పాత్లావత్‌ జగన్‌, బోరబండ పోలీసులు తెలిపిన ప్రకారం శంషాబాద్‌ సమీపంలోని ఏనుగుమడుగు తండాకు చెందిన పాత్లావత్‌ శాంతి (24) కాన్పు కోసం మోతీ నగర్‌లోని పద్మప్రియ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుంటోంది. కాన్పు కోసం దంపతులిద్దరు 27న ఆస్పత్రికి వచ్చారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదురుగా ఉన్న సౌమ్య ఆస్పత్రికి తరలించి 28న ఉదయం సిజేరియన్‌ ఆపరేషన్‌ చేశారు. పాప, బాబు జన్మించారు. తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అమీర్‌పేటలోని ఆస్టర్‌ ప్రైమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శాంతి భర్త జగన్‌, బంధుమిత్రులు ఆస్పత్రి వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బోరబండ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వీరశేఖర్‌, ఎస్‌.ఐ. తుల్జారామ్‌ రాథోడ్‌ పరిస్థితిని చక్కదిద్దారు. ఫిర్యాదు మేరకు డాక్టర్‌ పద్మావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రక్తహీనత ఉన్న ఆమెకు మందులతో చికిత్స అందించాం. ప్రసవం అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందనలు తగ్గడంతో పరిస్థితి విషమించిందని డాక్టర్‌ పద్మావతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని