logo

ఖర్చు చేసే ప్రతి రూపాయి అభ్యర్థుల ఖాతాలో వేస్తాం

ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఖర్చు చేసే ప్రతిరూపాయిని లెక్కిస్తామని, వ్యయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక సూచించారు.

Published : 30 Apr 2024 02:18 IST

రాజకీయ పార్టీల సమావేశంలో ఆర్వో 

మాట్లాడుతున్న ఆర్వో శశాంక

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఖర్చు చేసే ప్రతిరూపాయిని లెక్కిస్తామని, వ్యయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక సూచించారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని నార్మ్‌ గెస్ట్‌గౌస్‌లో అభ్యర్థులతో ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో శశాంక మాట్లాడుతూ.... ఎన్నికలలో ఖర్చు చేసిన వ్యయంపై మే నెల 3, 7, 11 తేదీలలో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. ఆ సమయంలో సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, ఆర్వో ముగ్గురు అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికల నిబంధనలను ఎవరూ అతిక్రమించినా సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టినట్లు తమ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రచారం సందర్భంగా ఎక్కడా విద్వేషం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించారు. అభ్యర్థులు అనుమతుల కోసం సువిధ పోర్టల్‌ను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్రకుమార్‌ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్‌చావ్రా, సెంథిల్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పాల్గొన్నారు.


చేవెళ్ల బరిలో 43 మంది అభ్యర్థులు

బీఎస్పీ అభ్యర్థితో సహా ముగ్గురు ఉపసంహరణ

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల బరిలో 43మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం వరకు ఉండటంతో చివరిరోజు ముగ్గురు అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. బీఎస్పీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన గోపిరెడ్డి చంద్రశేఖర్‌,  స్వతంత్ర అభ్యర్థులైన మహ్మద్‌ హిమామ్‌హుస్సేన్‌, మహ్మద్‌ చాంద్‌పాషాలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఆర్వో శశాంక గుర్తులు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని