logo

కొత్త పంథాలో రాజకీయ దావత్‌లు!

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

Updated : 30 Apr 2024 05:54 IST

ఫంక్షన్‌ హాళ్లలో ప్రత్యేక సమావేశాలు
ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థుల ఎత్తులు

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్రనేతలతో కార్నర్‌ మీటింగ్‌లు,  సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్‌, కార్యకర్తలను సమావేశపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దావత్‌ల నిర్వహణ జోరుగా సాగుతోంది. ఇందుకు శివార్లలోని ఫంక్షన్‌హాళ్లు, ఫాంహౌస్‌లు కేంద్రంగా మారుతున్నాయి. పార్టీ కార్యక్రమంలా కాకుండా శుభ కార్యక్రమంలా ఏర్పాట్లు చేసి మందు, విందులతో క్యాడర్‌, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. రానున్న 15 రోజులు కీలకం కావడంతో ఇలాంటి దావత్‌ సమావేశాలు మరిన్ని ఎక్కువగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు.


ఎన్నికల ఖర్చూ కారణమే

ఎన్నికల సంఘం నిఘా నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి దావత్‌లు కీలకం అవుతున్నాయి.  నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ.70లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.90 లక్షల వరకు పరిమితి ఉంది. అట్టహాసంగా ప్రచారాలు, ఎక్కడ పడితే అక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఆ ఖర్చు అభ్యర్థి ఖాతాలో పడుతుంది. ఇటీవలి నామినేషన్‌ కోసం అట్టహాసంగా వెళ్లిన ఓ నేత ఖాతాలో ఒకేరోజు రూ.10లక్షల ఖర్చు పడింది. 20రోజుల ముందే తన వ్యక్తిగత ఖాతాలో రూ.10లక్షల ఖర్చు పడితే..మున్ముందు ప్రచారాన్ని  నిర్వహించడం కష్టం కానుండటంతో అభ్యర్థులు అప్రమత్తమవుతున్నారు. ప్రచారం నిర్వహిస్తూ ఖర్చు తమ ఖాతాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో వేరే వ్యక్తుల పేర్లతో ఫంక్షన్‌ హాళ్లు అద్దెకు తీసుకొని శుభకార్యాన్ని నిర్వహించినట్లు ఖర్చు నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. పేరుకే దావత్‌ అన్నట్లు చూపుతూ తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు నువ్వా..?నేనా..? అన్నట్లు ఉన్న నియోజకవర్గాల్లో ఈ తరహా పార్టీలు జోరుగా సాగుతున్నాయి. అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించడం ద్వారా తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.


శుభకార్యాలకు హాజరు..

ఎన్నికల తరుణంలో నగరంలో శుభకార్యాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. కింది స్థాయి కార్యకర్తలు, నాయకుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు పిలిచిందే తడువుగా నేతలు హాజరవుతున్నారు. అక్కడకు వచ్చిన అతిథులతో ముచ్చట్లు పెడుతూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ కార్యాలకు వచ్చే ఇతర పార్టీల నేతలతో పలకరిస్తూ ఆయా పార్టీల కార్యకర్తలకు గేలం వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమ ఇంట్లో శుభ కార్యాలకు పిలిచినారాని నేతలు ఓట్ల పండగ ముందుండటంతో వారే చొరవ తీసుకొని వస్తుండటం కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతా ఎన్నికలమహిమ అనుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని