logo

పట్టుదలతో చదివి.. సత్తా చాటి

పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్‌-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు.

Published : 19 May 2024 04:33 IST

పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్‌-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. నగరానికి చెందిన పలువురు ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. భవిష్యత్తులో తాము సాధించబోయే లక్ష్యాలను వారి మాటల్లోనే వివరించారు. 


అమ్మానాన్న ప్రోత్సాహంతోనే సాధించా..

మహమ్మద్‌ అజ్హాన్‌సాద్, 6వ ర్యాంకు అగ్రికల్చర్, ఫార్మసీ 

నాచారం: మేం నాచారం పరిధి బాబానగర్‌లో ఉంటాం. నాన్నా ఈసీఐఎల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.  ప్రణాళిక ప్రకారం రోజుకు 12గంటల పాటు అభ్యసించడంతోనే ఈ ఫలితం వచ్చింది. తల్లిదండ్రులు మహమ్మద్‌ జమాలుద్దీన్, నూష్రాత్‌ జహన్‌ అందించిన ప్రోత్సాహంతోనే ఈ విజయం లభించింది. పదోతరగతిలో 487/500 మార్కులు, ఇంటర్మీడియట్‌ 970 మార్కులు సాధించాను. నీట్‌ ఫలితాలు ఇంకా రాలేదు. అందులో కూడా మంచి ర్యాంకు వస్తుందనే ఆశిస్తున్నా. మంచి ర్యాంకు రాకపోతే బయోటెక్నాలజీ చేస్తా. 


రోజుకు 10 గంటలు కష్టపడి చదివా

విదిత్‌ హుండేకర్, ఇంజినీరింగ్‌ 7వ ర్యాంకర్‌ 

మణికొండ: తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు రోజూ పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవడంతో ఈఏపీ సెట్‌లో 7వ ర్యాంకు సాధించాను. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించా. ముంబయి ఐఐటీలో సీఎస్సీ చేయాలనే లక్ష్యంతో చిన్ననాటి నుంచే ప్రణాళికతో చదివాను. ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉపకరించింది. విదిత్‌ హుండేకర్‌ తండ్రి అనీల్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, తల్లి మమత ఖాజాగూడలోని ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. మణికొండ అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో ఉంటున్నారు. 


క్యాన్సర్‌ వైద్యుడిగా స్థిరపడాలనుకుంటున్నా 

-భార్గవ్‌ సుమంత్, అగ్రికల్చర్, ఫార్మసీ 8వ ర్యాంక్‌

పేట్‌బషీరాబాద్‌: జీడిమెట్ల డివిజన్‌ ఎన్సీఎల్‌ కాలనీ సౌత్‌కు చెందిన జె.భార్గవ్‌ సుమంత్‌ ఎప్‌సెట్‌లో రాష్ట్రంలో 8వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి చంద్రశేఖర్‌ వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. తల్లి జయశ్రీ గృహిణి. ఇంటర్‌లో బైపీసీలో 985 మార్కులు సాధించాడు. ‘‘ర్యాంక్‌ సాధించడంలో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. నీట్‌ పరీక్ష కూడా రాశా. అందులో మంచి ర్యాంక్‌ వస్తే దిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదివి.. క్యాన్సర్‌ వైద్యుడిగా స్థిరపడాలనుకుంటున్నా’’ అని భార్గవ్‌ తెలిపారు. 


చదువుతోపాటు యోగా, ధ్యానం చేస్తా

పబ్బ రోహన్‌ సాయి, ఇంజినీరింగ్, 8వ ర్యాంకు

జూబ్లీహిల్స్‌: మాది ఎల్లారెడ్డిగూడ. కళాశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద నాన్న రాజేశ్వర్, అమ్మ లావణ్య ప్రోత్సాహంతో పాటు సాధించాలనే తపన వల్ల ఇది సాధ్యమైంది. నిత్యం ప్రణాళికాబద్ధంగా పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాను. రోజూ చదువుతోపాటు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తా, అప్పుడే చదువు మీద ఏకాగ్రత ఉంటుంది. ఇంటి నుంచే రోజు కళాశాలకు వెళ్లి వచ్చేవాడిని, అదే పనిగా చదవడం కాకుండా విరామం తీసుకుంటూ చదివేవాడిని. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలనేది లక్ష్యం. ఇందుకు సాధన చేస్తున్నా. 


డాక్టర్‌ని కావాలన్నదే లక్ష్యం

ఆదిత్య, 9వ ర్యాంకు, అగ్రికల్చర్,ఫార్మసీ 

వివేకానందనగర్‌కాలనీ: డివిజన్‌లోని కమలాప్రసన్ననగర్‌లో ఉంటాం.  నీట్‌ ద్వారా మంచి కళాశాలలో ఎంబీబీఎస్‌ చేయాలన్న లక్ష్యంతో చదివాను. లక్ష్యం సాధించేందుకు రెండేళ్లు నీట్‌కు సిద్ధమయ్యాను. నీట్‌తోపాటు ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేశాను. ఈనెల 5న నీట్‌ పరీక్ష రాసి మధ్యలో రెండు రోజులపాటు సిద్ధమై 8న ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష రాశాను. 9వ ర్యాంకు రావడం ఆనందాన్నిచ్చింది. వైద్యుడిగా స్థిరపడాలన్న లక్ష్యం సిద్ధమవుతూ వచ్చాను. తండ్రి సూర్యకాంత్‌ జయశెట్టి,  తల్లి జయలక్ష్మి, గురువుల ప్రోత్సాహంతో ఈ సక్సెస్‌ సాధ్యమైంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని