logo

మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో

ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేస్తూనే..

Published : 19 May 2024 04:36 IST

సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని సంస్థల్లో వినూత్నంగా ఆచరణ
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు 
ఈనాడు, హైదరాబాద్‌ 

ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేస్తూనే.. మరోవైపు వ్యక్తిగతంగా వస్త్రధారణతో ఇతరుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. వారంలో ఒకరోజు ఇస్త్రీ చేయని వస్త్రాలు ధరిస్తున్నారు.   పర్యావరణానికి కలిగే మేలును ప్రచారం చేస్తున్నారు.  

సోమవారం.. ఇస్త్రీ లేకుండా.. 

ఐఐటీ ముంబయికి చెందిన ఆచార్యులు చేతన్‌ ఎస్‌ సొలంకి ఇస్త్రీ చేయని బట్టలు ధరిస్తూ.. అది పర్యావరణానికి ఏ విధంగా ప్రయోజనమో చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని అందిపుచ్చుకున్న కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) తమ పరిధిలోని సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, సిబ్బందిని స్వచ్ఛందంగా ఆచరించాలని సూచించింది. ప్రొ.సొలంకి ఆలోచన నచ్చిన కొందరు సోమవారం రోజు ఇస్త్రీ చేయని వస్త్రాలను ధరిస్తున్నారు. మరికొందరు వారంలో తమకు నచ్చిన రోజు ఇలా చేస్తున్నారు. ‘సోమవారం సమావేశాలు ఉన్నప్పుడు ఇస్త్రీ చేసిన ఫార్మల్‌ వస్త్రాలను ధరిస్తాం. లేనప్పుడు  ఇస్త్రీ చేయని చొక్కా వేసుకుంటాం. అందరూ ధరించాలని తప్పనిసరి ఏమీ కాదు. వీలును బట్టి వేసుకోవచ్చు’’ అని ఐఐసీటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.  

200 గ్రాముల వరకు..

బట్టలు ఇస్త్రీ చేయాలంటే బొగ్గులతో లేదంటే కరెంట్‌తో చేయాల్సిందే. ఒక జత బట్టలు ఇస్త్రీ చేస్తే 200 గ్రాముల వరకు కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది. వారంలో ఒకరోజు ఇస్త్రీ చేయని వస్త్రాలను ధరించడంతో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో  కలవకుండా నిలువరించవచ్చు. 

  • దుస్తులు ఉతికేటప్పుడే ముడతలు కాకుండా  జాగ్రత్త తీసుకుంటే ఇస్త్రీ లేకపోయినా పెద్దగా తేడా అన్పించదు. ః కొంతమంది జీన్స్‌ వస్త్రాలను, టీషర్ట్‌లను సైతం ఇస్త్రీ చేయిస్తుంటారు. వీటికి ఇస్త్రీ అవసరం లేదని ఫ్యాషన్‌ డిజైనర్లు చెబుతున్నారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని