logo

ప్రాణ రక్షకులు

కరీంనగర్‌ విద్యానగర్‌కు చెందిన వివాహిత అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద అప్పులు చేసింది. చేసిన అప్పులు తీరకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు ఎక్కువవడంతో తీవ్ర మానసిక

Published : 23 Jan 2022 02:25 IST

బలవన్మరణాలను అడ్డుకుంటున్న లేక్‌ పోలీసులు

అవగాహనతో భరోసానిచ్చేలా చర్యలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ నేరవార్తలు

దిగువ మానేరు జలాశయం

కరీంనగర్‌ విద్యానగర్‌కు చెందిన వివాహిత అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద అప్పులు చేసింది. చేసిన అప్పులు తీరకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు ఎక్కువవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. చావే శరణ్యమని భావించి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఈ నెల 3న కరీంనగర్‌ మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లలతో కలిసి నీటిలోకి దిగడంతో పెద్ద కుమార్తె ‘అమ్మా.. వద్దు.. నేను చావను’ అంటూ ప్రాధేయపడినా ఆమె మనసు కరగలేదు. సీసీ కెమెరాల్లో వారి కదలికలను గుర్తించిన లేక్‌ పోలీసులు వారిని రక్షించారు. కౌన్సెలింగ్‌ చేసి ఇంటికి పంపించారు.

మానేరు జలాశయం వద్ద తచ్చాడే ప్రతి ఒక్కరిని పోలీసులు ఎవరని ఆరా తీస్తున్నారు. వారితో మాట్లాడుతూ.. ఎందుకొచ్చారని కూపీ లాగుతున్నారు. మానసిక వేదనతో చనిపోవాలని ఇక్కడికి వచ్చే వారిని గుర్తిస్తున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి జీవితం విలువను తెలియజెప్పుతున్నారు. సఖి కేంద్రాలతోపాటు మహిళా పోలీసు ఠాణాల వద్దకు వారిని పంపిస్తూ వారి వెతల్ని తీర్చే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. వారి కుటుంబీకులతో మాట్లాడుతూ మరోసారి చావు ప్రస్తావన రాకుండా బతుకుమీద ఆశల్ని పెంచుతున్నారు.

కరీంనగర్‌ మానేరు జలాశయంలో ఆత్మహత్యలు పెరుగుతున్న దృష్ట్యా అప్పటి పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి జలాశయం భద్రతను కట్టుదిట్టం చేసేందుకు 2017 అక్టోబరు 10న ఎస్సైస్థాయి అధికారి పర్యవేక్షణతో లేక్‌ అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో జలాశయం కట్టపై 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను కొనసాగిస్తున్నారు. మూడు షిఫ్ట్‌ల వారీగా మొత్తం 15 మంది సిబ్బంది రేయింబవళ్లు పర్యవేక్షిస్తుంటారు. రెండు ద్విచక్రవాహనాలు, ఒక పెట్రో వాహనంపై నిరంతరం గస్తీ కొనసాగిస్తుంటారు. అవుట్ పోస్టులో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ ఆధారంగా ప్రతి ఒక్కరి కదలికలను గుర్తిస్తారు. లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు  మొత్తం 199 మంది మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా పోలీసులు రక్షించారు. వారు ఒక్కరే కాకుండా ఎనిమిది మంది చిన్నారులను సైతం ఈ లోకానికి దూరం చేయాలని భావించిన వారి జీవితాల్ని నిలబెట్టారు.

కౌన్సెలింగ్‌తో మార్పు..

ఏదో ఒక బాధతో వచ్చే వారికి పోలీసులు ఇస్తున్న కౌన్సెలింగ్‌ వరంగానే మారుతుంది. గతంలో చావు నుంచి తప్పించుకుని మంచిగా జీవిస్తున్న వారి జీవన పాఠాల్ని పోలీసులు తెలియజేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు మేమున్నాముంటూ చేయూతనివ్వడమే కాకండా ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తున్న అనుభవాల్ని వివరిస్తూ వారి సహకారంతో బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు అందించే ప్రయత్నాల్ని చేస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేసి వారికి ఓ దారిని చూపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి తీసుకున్న నిర్ణయంతో వచ్చిన అనేక మందికి పోలీసులు కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేస్తూ వారి మానసిక పరిస్థితిని దారిలోకి తీసుకొస్తున్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు కరీంనగర్‌ మహిళా, శిశు సంక్షేమ శాఖ, కరీంనగర్‌లోని సఖీ కేంద్రం చేయూతనిస్తోంది. అత్యవసర సమయంలో వారికి అండగా నిలవడం.. ప్రభుత్వం పరంగా సాయం చేయడం జరుగుతుంది. ఇక భార్యభర్తల, కుటుంబ సమస్యల కోసం కరీంనగర్‌ మహిళా పోలీసు ఠాణా సైతం పరిష్కారానికి ముందుంటుంది.

మానసిక ధైర్యమే కీలకం

ఎంతటి కష్టం వచ్చినా బతికి గెలవాలన్నదే ముఖ్యమని ఇందుకోసం మనస్సును ధైర్యంగా మలుచుకోవాలని మనస్తత్వ నిపుణులు డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నారు. ప్రతి నిత్యం తనవద్దకు వచ్చే వారిలో ఒకరిద్దరైనా బతుకును చాలించాలనుకునే వారేనని.. వారికి మంచి ఆశతో కూడిన జీవిత అవసరాన్ని వివరిస్తుండటంతో వారంతో ఇప్పుడు హాయిగా ఉండగలుగుతున్నారని ఆయన అంటున్నారు. కుటుంబం అన్నాక ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంటుంది. అప్పటికప్పుడు పరిష్కరించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. నువ్వెంత అంటూ పట్టింపులకు పోతే గొడవలు తీవ్రతరం కావడంతో పాటు పెద్ద పంచాయతీ, పోలీసు ఠాణాలకు చేరుకోవాల్సి వస్తుందని అందరూ గుర్తించాలి. చివరకు పిల్లల భవిష్యత్తు ఏమిటని అలోచిస్తే... తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం గుర్తు వస్తుంది. మనం చేసిన తప్పిదం మన పిల్లలపై పడకుండా ఉంటేనే భవిష్యత్తు అందంగా..ఆనందంగా సాగిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

రాజీ మార్గమే అసలైన పరిష్కారం -వెంకట్రెడ్డి, ఎస్సై,  లేక్‌ అవుట్ పోస్టు

చిన్న సమస్యలను పెద్దగా చూడటం వల్ల దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుంటాయి. కరీంనగర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారు కాకుండా చుట్టుపక్కన జిల్లాలకు చెందిన అనేక మంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా వారిని రక్షించాం. కౌన్సెలింగ్‌తో వారిలో మార్పు తీసుకొచ్చాం. సంఘటన జరిగిన నాటి నుంచి ప్రతి 15 రోజులకు ఒక సారి వారికి ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలపై విచారిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని