logo

సమీకృత కార్యాలయం.. ప్రత్యేకతల సమాహారం

జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయం ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 7న ప్రారంభించనుండగా సముదాయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

Published : 05 Dec 2022 05:45 IST

కలెక్టరేట్‌ సముదాయం(వ్యూ) న్యూస్‌టుడే, జగిత్యాల: జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయం ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 7న ప్రారంభించనుండగా సముదాయాన్ని అందంగా తీర్చిదిద్దారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్‌ 11న జగిత్యాల జిల్లా ప్రారంభం కాగా సమీకృత కార్యాలయాల సముదాయానికి 2017 అక్టోబర్‌ 12న శంకుస్థాపన చేశారు. ధరూర్‌క్యాంపులో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.49.20 కోట్లతో చేపట్టిన పనులు 2019 జూన్‌లో పూర్తయ్యాయి. కార్యాలయ పరిసరాలు, ప్రధాన రహదారిలో పచ్చదనం పరచుకుంది. కలెక్టరేట్‌ ముందు హెలీప్యాడ్‌ నిర్మించారు. రాష్ట్రంలోనే తొందరగా పనులు పూర్తి చేసుకున్న కలెక్టరేట్‌ జగిత్యాల కాగా మూడేళ్లుగా ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.

ఆధునిక సౌకర్యాలు

జీ ప్లస్‌ టూ విధానంలో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టర్‌, 2879 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు కలెక్టర్‌ కార్యాలయాలు నిర్మించగా మరో 2130 చదరపు అడుగుల్లో ఏ, బీ, సీ, డీ బ్లాకులు నిర్మించారు. మంత్రులు, కలెక్టర్లు సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక హాల్స్‌, సందర్శకుల విశ్రాంతి, విశాలమైన గదులు, ఏసీ, లిఫ్ట్‌ సౌకర్యం కల్పించారు. కార్యాలయాల సమావేశ మందిరాల్లో ఫర్నీచర్‌ సిద్ధం చేశారు. మొత్తం 32 శాఖలకు కార్యాలయాలు కేటాయించగా పశు సంవర్ధకశాఖ ధరూర్‌క్యాంపులోనే కొత్త భవనం నిర్మించుకోగా ప్రస్తుతం ఆభవనాన్ని పోలీసుశాఖ కోరుతుండటం కొత్త కలెక్టరేట్‌లో కార్యాలయం కేటాయించకపోవటంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా మారింది.

ఏ కార్యాలయం ఎక్కడ

గ్రౌండ్‌ఫ్లోర్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కార్యాలయాలు, సమావేశ మందిరం, బ్యాంకు, పోస్టాఫీసు, ఏటీఎం, కలెక్టరేట్‌ జిరాక్స్‌, ఎన్‌ఐసీ, ఐటీ వింగ్‌, సర్వర్‌ రూం, సమాచారశాఖ, వీడియో కాన్ఫరెన్స్‌, మరుగుదొడ్లు, స్త్రీ శిశుసంక్షేమశాఖ కలెక్టరేట్‌ సిబ్బంది, ట్రెజరీ, విశ్రాంతి గది ఉన్నాయి. మొదట అంతస్థులో డీఆర్డీవో, డీపీవో, వ్యవసాయ, మైనింగ్‌, ఉపాధి కల్పన, సర్వే, కార్మికశాఖ, గృహ నిర్మాణ, ఎస్సీ కార్పొరేషన్‌, ఆబ్కారీ, బీసీ, ఎస్సీ సంక్షేమ కార్యాలయాలుండగా రెండో అంతస్థులో సహకార, మార్క్‌ఫెడ్‌, ఉద్యానవన, పౌరసరఫరాల, ఆడిట్‌, మిషన్‌భగీరథ, పరిశ్రమలు, మత్స్యశాఖ కార్యాలయాలున్నాయి.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు