logo

రేపే ప్రభుత్వ వైద్య కళాశాల మహోత్సవం

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరీంనగర్‌ వాసుల కల నెరవేరబోతుంది. ఈ నెల 15న జిల్లాలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ తరగతులకు రంగం సిద్ధం అయింది

Published : 14 Sep 2023 03:47 IST

 జిల్లాలో తరగతుల నిర్వహణకు రంగం సిద్ధం

వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరీంనగర్‌ వాసుల కల నెరవేరబోతుంది. ఈ నెల 15న జిల్లాలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ తరగతులకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన 9 వైద్య కళాశాలల్లో తరగతులను వర్చువల్‌గా ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వైద్య కళాశాల బృందంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

94 మందికి పైగా నియామకం

కరీంనగర్‌ వైద్య కళాశాలకు ఇప్పటివరకు ఒక ప్రిన్సిపల్‌తో పాటు మెడికల్‌ సూపరింటెండెంట్‌, 45 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అయిదుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు పరిపాలనాధికారులు, ఆర్‌ఎంఓలను నియమించింది. ఇందులో వైద్య, విధాన పరిషత్‌ నుంచి మరో 35 మంది సిబ్బందిని వైద్య కళాశాలకు కేటాయించారు.

తరగతులకు సర్వం సిద్ధం

కొత్తపల్లిలోని వైద్య కళాశాలలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 15న సీఎం అధికారికంగా వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులతో పాటు వైద్య కళాశాల బృందం దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. వైద్య కళాశాలకు 100 సీట్లతో అనుమతి రాగా ఇప్పటివరకు జరిగిన పలు కౌన్సెలింగ్‌లలో మొత్తం 90 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. మరో పదిమంది విద్యార్థులు రానున్నారు. బాలికలకు తీగలగుంటపల్లిలో, బాలురుకు పద్మనగర్‌లోని ప్రైవేట్‌ భవనాలలో వసతి కల్పించారు. విద్యార్థులు కళాశాలకు వెళ్లివచ్చేలా వారికి రవాణా సౌకర్యం కోసం రెండు బస్సులను అద్దెకి మాట్లాడినట్లు తెలిసింది.

ఘనంగా ఏర్పాట్లు

కరీంనగర్‌కి ప్రభుత్వ వైద్య కళాశాల రావడంతో తరగతుల ప్రారంభం ఘనంగా ఉండేందుకు జిల్లా ఇంఛార్జీ మంత్రి కమలాకర్‌ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 25 వేల మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో రేకుర్తి నుంచి కొత్తపల్లి వైద్య కళాశాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టేందకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఉన్నతాధికారులు, మంత్రుల కృషి

తొమ్మిది వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అన్ని వైద్య కళాశాలలకు అనుమతి వచ్చి చివరికి కరీంనగర్‌ ఆగిపోయింది. కళాశాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు మంత్రులు హరీశ్‌ రావు, ఇన్‌ఛార్జి మంత్రి కమలాకర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు వైద్య కళాశాల మంజూరయ్యేవరకు ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. జాతీయ వైద్య మండలి నుంచి ఆసుపత్రి తనిఖీకి వచ్చిన అధికారులు సూచించిన సూచనలు, చూపించిన రిమార్కులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ అనుమతి వచ్చేవరకు తగిన చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు జూన్‌లో జాతీయ వైద్య మండలి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాలగా మారిపోయింది.

విజయవంతం చేయాలి

కరీంనగర్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15న వర్చువల్‌గా ప్రారంభించనున్న వైద్య కళాశాల, 17న నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలను సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ బి.గోపి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. 15న ఉదయం రేకుర్తి బ్రిడ్జి నుంచి మెడికల్‌ కళాశాల వరకు విద్యార్థులు, వైద్య విద్యార్థులు, ఆశా, ఏఎన్‌ఎంలు, స్వశక్తి సంఘ సభ్యులతో భారీ ర్యాలీ అనంతరం జరగనున్న ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 17న పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చూడటంతో పాటు వివిధ శాఖల వారీగా నిర్వహించే కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు కమిషనర్‌ సుబ్బారాయుడు మాట్లాడుతూ 15వ తేదీన కళాశాల వద్ద ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌, ప్రఫుల్‌దేశాయ్‌, డీఆర్‌వో పవన్‌, ఆర్డీవో కొమరయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.  

ప్రయాణికులు జాగ్రత్త..

కరీంనగర్‌ రవాణా విభాగం : ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15న కరీంనగర్‌ నుంచి జగిత్యాల రూట్‌లో బస్సు సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు ఆర్‌ఎం ఎన్‌.సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 8 నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు బస్సు సర్వీసులను కరీంనగర్‌ బస్టాండ్‌, రాంనగర్‌, చింతకుంట బైపాస్‌, కొత్తపల్లి (హవేలి) మీదుగా నడుపుతున్నట్లు చెప్పారు. గీతాభవన్‌, కోర్టుచౌరస్తా, ఎస్సారార్‌ కళాశాల, జోనల్‌ వర్క్‌షాపు, రేకుర్తిలో బస్సు ఎక్కే ప్రయాణికులు 15న తమ ప్రయాణాలను కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి కొనసాగించాలని కోరారు. టెట్‌ పరీక్ష కూడా అదే రోజు ఉందని.. ప్రయాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి తగిన ప్రణాళికలు చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు