logo

అభివృద్ధి చూపి ఓట్లడగాలి

గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్‌ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Published : 28 Apr 2024 05:26 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

బోయినపల్లిలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, పక్కన
ఎమ్మెల్యేలు సత్యం, సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు

బోయినపల్లి, న్యూస్‌టుడే: గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్‌ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి బోయినపల్లిలో శనివారం స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సంజయ్‌ పార్టీ అధ్యక్ష పదవిని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడటంతోనే రాత్రికి రాత్రి ఆ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ఎంపీగా అయిదేళ్లలో చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగకుండా రాముడి పేరు చెప్పి, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  మధ్యమానేరు ముంపు నిర్వాసితులకు రూ. 5.04 లక్షలు కేంద్రం నుంచి ఇప్పిస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన సంజయ్‌ ఎందుకు నిర్వాసితుల సమస్య పరిష్కరించలేదని నిలదీశారు. మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఎంపీ, భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ అత్తగారి మండలం బోయినపల్లిని ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, మండల అధ్యక్షుడు వెన్నల రమణారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీంరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, బోయినపల్లి పీఏసీఎస్‌ ఛైర్మన్‌ జోగినపల్లి వెంకటరామారావు, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ ముదుగంటి సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని