logo

సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు.

Updated : 30 Apr 2024 06:11 IST

వైద్యుల తీరుతో రోగుల అవస్థలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగుల నిరీక్షణ

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. సోమవారం ఉదయం ఆసుపత్రిలో 9 గంటల నుంచి 10 గంటల వరకు ‘న్యూస్‌టుడే’ పరిశీలన చేయగా పలు వార్డుల్లో వైద్యులు కనిపించలేదు. పీజీలు రోగులను పరీక్షించి మందులు రాశారు. మరికొన్ని వార్డులైతే వైద్యులు రాకపోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఓపీలలో ఉదయం 9 గంటల నుంచి ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొద్ది సమయం ఎదురుచూసిన రోగులు ఇంటికి వెళ్లిపోయారు. చిన్న పిల్లల వార్డులో పలువురు చిన్నారులు ఆక్సిజన్‌తో ఉన్నారు. వారిని ఉదయం 9 గంటలకే పరీక్షించి చికిత్స అందించాల్సి ఉండగా, డాక్టర్లు అప్పటివరకు రాలేదు. సిబ్బందిని అడగగా రౌండ్స్‌కు రాలేదని చెప్పడానికి నిరాకరించారు. జిల్లా ఉన్నతాధికారులందరూ కూత వేటు దూరంలో ఉండే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి తీరే ఇలా ఉంటే దూర ప్రాంతాల్లో ఉన్న దవాఖానాల పర్యవేక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

85 మందికిపైగా వైద్యులుండగా..

ఆసుపత్రిలో 85 మందికిపైగా వైద్యులు పని చేస్తున్నారు. వారెవరూ సెలవులో లేరని వైద్యాధికారులు చెబుతున్నారు. సోమవారం 15 మంది డాక్టర్లు కూడా హాజరుకాకపోవడం విశేషం. ప్రతి వార్డులో దాదాపు నలుగురు వైద్యుల బృందాన్ని నియమించారు. అందులో పలు ఓపీలలో, వార్డులలో ఒక్క వైద్యుడు లేకపోవడం దారుణం. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు ఇబ్బందిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి తగిన చర్యలు తీసుకుంటే పేద రోగులకు చికిత్స అందుతుంది. ప్రభుత్వ వైద్యులు ఎన్నికలు జరిగాయని అందుకే హాజరుకాలేదని తెలిసింది. ఎన్నికలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగినట్లు సమాచారం. అందుబాటులో ఉన్నా కొందరు విధులకు ఆలస్యం వచ్చినట్లు తెలిసింది. ఓపీలలో, వార్డులలో వైద్యులు లేరనే విషయంపై విచారించి చర్యలు తీసుకుంటామని వైద్యులెవరూ సెలవులో లేరని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరారెడ్డి తెలిపారు. పిల్లల వార్డులో వైద్యులు పది గంటల తర్వాత రౌండ్స్‌ వేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఖాళీగా దర్శనమిస్తున్న వైద్యుల ఛాంబర్‌

కరీంనగర్‌కు వెళ్లి.. తిరిగి ఆసుపత్రికి!

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ పట్టణం: హుజూరాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి ప్రధాన వైద్యులు సోమవారం ఒకరి వాహనంలోనే కలిసి నేరుగా కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి హుజూరాబాద్‌ ప్రాంతీయాసుపత్రికి వచ్చారు. ఇక్కడ ఉదయం ఓపీ సేవలకు వచ్చిన పలువురు వైద్య సేవలందక వెనుదిరిగారు. మధ్యాహ్నం వేళలో ఓ వృద్ధుడు తనకు నీరసంగా ఉందని ఆసుపత్రికి రాగా.. విధుల్లో ఉన్న వైద్యురాలు మధ్యాహ్న భోజనానికి వెళ్లారని అక్కడున్న సెక్యూరిటీ చెప్పి రెండు, మూడు గంటలు నిరీక్షించేలా చేయడంతో గత్యంతరం లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా వైద్యులు ఓటేయడానికి జిల్లా కేంద్రానికి వెళ్లడంతో వచ్చిన సమస్య. ఆసుపత్రిలోనే ఉండి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ సుధాకర్‌రావు, మరో సీనియర్‌ వైద్యుడు నారాయణరెడ్డిలతో కలిసి అలా వెళ్లి ఓటేసి ఇలా తిరిగి ఆసుపత్రికి చేరుకున్నామని ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్‌ ఎ.రాజేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చిపోయే వారి కోసం రెండు ద్వారాలు ఏర్పాటు చేయగా, జమ్మికుంట రహదారి వైపు ద్వారానికి మధ్యాహ్నం అయితే తాళం వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని