logo
Published : 29 Jun 2022 04:07 IST

అంబేడ్కర్‌ నీడన చదువుల కోవెల

సీయూఈటీకి సిద్ధమైన ‘బేస్‌’


ఎల్‌ఎస్‌ఈకి దీటైన ప్రాంగణం ఇదిగో..

ఈనాడు, బెంగళూరు : దేశానికి కేవలం ఇంజినీర్లు, వైద్యులే కాదు.. ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తల అవసరం ఎంతో ఉంది. భారత్‌ను సుస్థిర ఆర్థిక సామర్థ్యం ఉన్న దేశంగా మలచాలంటే సమర్థమంతమైన ఆర్థికవేత్తల అవసరం ఉందని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ విశ్వవిద్యాలయం బాటలో బెంగళూరులో స్థాపించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (బేస్‌) నాలుగేళ్ల కిందటే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది. 250 మంది విద్యార్థులతో ఒక బ్యాచ్‌ను ముగించింది. ఈ ఏడాది మరో ఘనతకు శ్రీకారం కుట్టింది. విశ్వవిద్యాలయాల వేతన సంఘం (యూజీసీ) తొలిసారి నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు బేస్‌ విశ్వవిద్యాలయం సిద్ధమైంది.

తొలి రాష్ట్ర విశ్వవిద్యాలయం

సాధారణంగా సీయూఈటీని యూజీసీ నిధులతో నిర్వహించే కేంద్రీయ విశ్వవిద్యాలయాలే అమలు చేస్తాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల జాబితాలోని బేస్‌ విశ్వవిద్యాలయం సీయూఈటీకి సిద్ధమైంది. కలబురగిలోని కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇప్పటికే సీయూఈటీని ఆమోదించగా, రాష్ట్ర విద్యాలయాల్లో బేస్‌ విశ్వవిద్యాలయం మాత్రమే ఈ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించనుంది. జులై 15 నుంచి ఆగస్టు 10 లోపు (తేదీల్లో మార్పులకు అవకాశం ఉంది) నిర్వహించే సీయూఈటీ కోసం బేస్‌ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంకొన్ని విశ్వవిద్యాలయాలు ఈ ప్రతిపాదనలు పంపినా వాటికి 2023-24 ఏడాదిలోనే అనుమతి దొరికే అవకాశం ఉంది.

లక్షల్లో దరఖాస్తులు

మేలో సీయూఈటీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా కేవలం రెండు వారాల వ్యవధిలోనే మూడు లక్షలకు పైగా దరఖాస్తులు బేస్‌లో ప్రవేశాల కోసం వెల్లువెత్తాయి. ఇందులో 30 శాతం ఉత్తరప్రదేశ్‌, 20 శాతం దిల్లీ, 18 శాతం బిహార్‌ నుంచి వచ్చాయి. దక్షిణాది నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావటం గమనార్హం. ఆర్థిక శాస్త్రంలో చదువులంటే ఉత్తరాది విశ్వవిద్యాలయాల్లో చేరాలన్న అనివార్యతను తప్పించేందుకే బేస్‌ విశ్వవిద్యాలయం స్థాపించారు. గడచిన నాలుగేళ్లలో ఉత్తరాది నుంచే దరఖాస్తులు ఎక్కువగా రాగా, వచ్చే ఏడాది నుంచి దక్షిణ భారత విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరిగే అవకాశాలున్నట్లు ఇక్కడి యాజమాన్యం అంచనా వేస్తోంది. ప్రపంచశ్రేణి ఆర్థిక శాస్త్ర అధ్యయనాలకు వేదికగా ఉండే బేస్‌లో ప్రవేశాలు ఇకపై సీయూఈటీ ద్వారానే చేపట్టనుండగా, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులకు అవకాశం పెరగనుంది. 2019లో విశ్వవిద్యాలయ హోదా పొందిన ఈ కేంద్రం తొలి ఏడాది యూజీసెట్‌ ద్వారా ప్రవేశాలు నిర్వహించగా, తర్వాతి సంవత్సరం సొంతగా ప్రవేశ పరీక్ష నిర్వహించింది.


భవిష్యత్తు ఆర్థికవేత్తలకు ప్రధాని దీవెనలు (పాత చిత్రం)

అందరూ హాస్టల్‌లోనే

విశ్వవిద్యాలయంలో ఏటా భర్తీ చేసే సీట్లలో 60 శాతం కర్ణాటక విద్యార్థులకు, మిగిలిన 40శాతం ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తారు. ఈ విశ్వవిద్యాలయంలో చేరే వారందరూ వసతి నిలయాల్లోనే ఉండాలన్నది నిబంధన. ప్రస్తుతం 250 మంది ఇక్కడ చదువుతుండగా వీరి సంఖ్యను 2024-25 ఏడాదికి 1,100కు చేర్చాలన్నది ప్రణాళిక. మొత్తం 13 బ్లాకులున్న ప్రాంగణంలో తొలిదశలో రూ.250 కోట్ల పనులు మరో దశలో వందకోట్లతో అన్ని సదుపాయాలతో సిద్ధం చేస్తారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌-స్టెమ్‌ విధానానికి సమర్థమంతమైన ప్రత్యామ్నాయ విద్యను అందించాలన్న ఎన్‌ఈపీ మార్గదర్శకాలతో ఈ విశ్వవిద్యాలయం సరికొత్తగా తయారు కానుంది.

చదువుల వేదిక!

* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ అర్థశాస్త్రం (ఐదేళ్లు)

* ఎమ్మెస్సీ - అర్థశాస్త్రం (రెండేళ్లు)

* ఎమ్మెస్సీ ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌ (రెండేళ్లు)

* రుసుములు: ప్రతి ఏటా వసతి, బోధనకు రూ.1.25 లక్షలు

* గడువు : సీయూఈటీ దరఖాస్తులకు జులై 10 వరకు..

పరిశోధనలు పెంచుతాం

ప్రస్తుతం ఎల్‌ఎస్‌ఈ తరహా విద్యా విధానం అమలు చేస్తుండగా, యునిసెఫ్‌, ఆర్‌బీఐల నేతృత్వంలో ఆరు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నాం. పబ్లిక్‌ పాలసీ మేకింగ్‌లోనూ ఫెలోషిప్‌ కార్యక్రమం మొదలు పెట్టాం. విశ్వవిద్యాలయ హోదా పొందిన తొలి ఏడాదిలోనే 92 శాతం ప్లేస్‌మెంట్‌ సాధించాం. ప్రపంచవ్యాప్తంగా బేస్‌ విద్యార్థులకు డిమాండ్‌ పెరుగుతోంది. రానున్న రోజుల్లో పరిశోధనల సంఖ్యను పెంచనున్నాం.

-డాక్టర్‌ ఎన్‌.ఆర్‌.భానుమూర్తి, వీసీ, బేస్‌

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts