logo

వీరవనితల.. ధీర గడప!

చాముండేశ్వరి శక్తిస్వరూపిణి! ఆమె దయతో కన్నడనాడు సుభిక్షంగా ఉందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తించారు. అంతేకాదు.. ఈ గడ్డపై పుట్టిన ఒణికే ఓబవ్వ, కిత్తూరు రాణి చెన్నమ్మ, అబ్బమ్మ వంటి ధీరవనితల అడుగు జాడలతో చందనసీమ వీర చరితను సొంతం చేసుకుందని శ్లాఘించారు. ఈయేట మైసూరు దసరా

Published : 27 Sep 2022 01:07 IST

కన్నడనాడుపై రాష్ట్రపతి ప్రశంసలు

మైసూరు దసరా వేడుకలు ప్రారంభ వేదికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రేక్షకులకు నమస్కరిస్తున్న

గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌జోషి,

శోభా కరంద్లాజె, రాష్ట్ర మంత్రి సోమశేఖర్‌

ఈనాడు, బెంగళూరు : చాముండేశ్వరి శక్తిస్వరూపిణి! ఆమె దయతో కన్నడనాడు సుభిక్షంగా ఉందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తించారు. అంతేకాదు.. ఈ గడ్డపై పుట్టిన ఒణికే ఓబవ్వ, కిత్తూరు రాణి చెన్నమ్మ, అబ్బమ్మ వంటి ధీరవనితల అడుగు జాడలతో చందనసీమ వీర చరితను సొంతం చేసుకుందని శ్లాఘించారు. ఈయేట మైసూరు దసరా అగ్రపూజకు ఆహ్వానం అందిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ఎంతో ఆనందంగా అంగీకరించారని సోమవారం వేడుకల ప్రారంభ వేదికపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సంతోషం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము చరిత్రలో నిలిచిపోతారు! రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె పర్యటించిన తొలి రాష్ట్రం కర్ణాటక కావటం మరో విశేషం. దసరా ఉత్సవాల ఆహ్వానంతో పాటు రాష్ట్ర బృందం అందించిన మైసూరు పట్టు చీరను ధరించి సోమవారం మైసూరుకు రావటం మరో అరుదైన ఘట్టం. ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తన ప్రసంగంలో ఆమె రాక ప్రత్యేకతలను ప్రస్తావించారు. ఆమె నిరాడంబరత్వాన్ని పదేపదే కొనియాడారు.

* కన్నడనాట అన్ని రంగాలకు అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పేదలందరికీ చేరిన నాడే నాడహబ్బకు సార్థకత చేకూరుతుందన్నారు. శ్రమించే కార్మికులు, రైతులు, సామాన్యులు సుభిక్షంగా ఉండేందుకు చాముండేశ్వరి ఆశీర్వాదాలు అవసరమన్నారు. ఏటేటా సమృద్ధిగా వర్షాలు, పంటను అందించే ప్రకృతి ఆరాధన అనివార్యమని చెప్పారు. రెండేళ్లుగా నిరాడంబర ఉత్సవాలకే పరిమితమైన మైసూరు దసరా ఈసారి అర్థవంతంగా, గత వైభవాన్ని స్మరించుకునేలా నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటించారు. మైసూరు ఉత్సవాలు ఆధునిక సమాజాన్ని కూడా సన్మార్గంలో నడిపిస్తూ, మనలోని దుర్గుణాలను సంహరించి ఆత్మ శుద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పిస్తాయన్నారు.

ఐఐటీలు.. శక్తి కేంద్రాలు

దేశంలోని ఐఐఐటీలు దేశానికి నైపుణ్య వనరులను అందించే శక్తి కేంద్రాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైపేర్కొన్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపతి ముర్ముతో పాటు ఐఐఐటీ ధార్వాడ కట్టడ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన సమాజానికి ఉపయోగపడని సాంకేతిక విద్య రాణించదన్నారు. ఎక్కడో ఒడిసాలో పుట్టిన గిరిజన మహిళ రాష్ట్రపతి హోదాలో ఐఐఐటీని స్థాపించేందుకు రావటం సాంకేతిక విద్య మహత్తును చాటుతుందన్నారు. గతంలో రాష్ట్రపతులు, ప్రధానులు కేవలం విధానసౌధ, రాజ్‌భవన్‌లకు మాత్రమే వస్తుండేవారు. నేడు ఐఐఐటీ, ఇన్ఫోసిస్‌, విప్రో, ఇస్రో వంటి సంస్థలను భేటీ చేయటాన్ని ఆయన గుర్తు చేశారు. కోట్లాది భారత జనాభాను చూసి ఎద్దేవా చేసిన దేశాలు నేడు మన దేశ మానవ వనరుల కోసం అర్రులు చాస్తున్నారన్నారు. దేశ జనాభా ప్రగతికి అవరోధమనే భావనను తుడిచిపెట్టి ఈ అవరోధాన్ని ప్రగతికి వనరులుగా మార్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. ఆరేళ్లుగా సొంత భవనం లేని ఐఐఐటీ ధార్వాడకు భూములిచ్చిన రైతులు సాంకేతిక ఫలాన్ని దేశానికి అందించారు. త్వరలో ఎంటెక్‌ కోర్సులు ప్రారంభించి ప్రవేశాల సంఖ్యను రెండు వేలకు చేరుస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

 ధార్వాడలో పౌర సన్మాన అందుకుంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సంప్రదాయం కొనసాగింపు

మైసూరు, న్యూస్‌టుడే : విఖ్యాత దసరా ఉత్సవాలు, సంప్రదాయాలను కొనసాగించడం తనకు దక్కిన అరుదైన అవకాశమని రాజవంశస్తుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు పేర్కొన్నారు. మైసూరు సంస్థానంలో రాజా ఒడెయరు 1610లో శ్రీరంగపట్టణ వద్ద దసరా ఉత్సవాలను నిర్వహించారని గుర్తు చేశారు. ఉత్సవాలను ఈ ఏడాది ప్రారంభించిన రాష్ట్రపతి మాట్లాడుతూ మహిషాసురుడిని సంహరించిన చాముండి మహిళా శక్తికి ప్రతీక అని పేర్కొనడంపట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.


రాజాధిరాజ.. మార్తాండ తేజ!

వందిమాగధులతో కలిసి దర్బార్‌కు వస్తున్న యదువీర్‌

మైసూరు, న్యూస్‌టుడే : రాచనగరి మైసూరు రాచప్రసాదంలో నవరాత్రి వేడుకల నేపథ్యంలో రాజవంశస్తుడు యదువీర్‌ కృష్ణదత్త ఒడెయరు సోమవారం ప్రైవేటు దర్బారు నిర్వహించారు. దర్బార్‌కు వచ్చేందుకు ముందు.. రాజమాత ప్రమోదాదేవి ఆశీస్సులు అందుకున్నారు. కుమారుడు ఆద్యవీర్‌ మొదట తండ్రి పాదాలపై పూలరేకులు చల్లి నమస్కరించాడు. రాజకుమారి త్రిషిక భక్తిప్రపత్తులతో భర్తకు పాదపూజ చేసి, హారతి ఇచ్చారు. అంతఃపురంలోని మహిళలు, రాజకుటుంబీకులు ఆయనకు హారతి ఇచ్చి అంబావిలాస్‌ ప్యాలెస్‌లోని ప్రైవేటు దర్బార్‌కు సాగనంపారు. వందిమాగధులతో కలిసి దర్బార్‌ హాలుకు చేరుకున్న యదువీర్‌ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మొదట చాముండి విగ్రహానికి, అనంతరం రత్నఖచిత బంగారు సింహాసనానికి పూజలు చేశారు. కంకణధారణ అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం మధ్యాహ్నం 12.15కి సింహాసనాన్ని అధిరోహించారు. దర్బార్‌ నిర్వహణ పూర్తయిన తర్వాత కర్ణాటకతో పాటు, దేశంలోని 33 ఆలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, తీర్థాలను ఆయన స్వీకరించారు. ప్రైవేటు దర్బారును యదువీర్‌ నిర్వహించడం ఇది ఎనిమిదో ఏడాది. దసరా ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిత్యం యదువీర్‌ ప్రైవేటు దర్బార్‌ను ఇలానే కొనసాగిస్తారు. అక్టోబరు నెలాఖరుకు సింహాసనాన్ని విడదీసి, ఖజానాలో భద్రపరుస్తారు. ప్రైవేటు దర్బార్‌ నేపథ్యంలో ప్యాలెస్‌లోకి సందర్శకుల అనుమతిపై నిర్బంధాన్ని విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని