logo

అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష

బళ్లారి లోక్‌సభ బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్‌.జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి

Published : 23 Apr 2024 02:13 IST

ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యత

 

హొసపేటెలో జరిగిన ఓ కార్యక్రమంలో గెలుపోటములపై చర్చలు జరుపుతున్న బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు నాగేంద్ర, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌

హొసపేటె, న్యూస్‌టడే: బళ్లారి లోక్‌సభ బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్‌.జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి. అభ్యర్థి తుకారాంను గెలిపించుకోవడం కోసం బళ్లారి జిల్లా బాధ్యమంత్రి బి.నాగేంద్ర రేయింబవళ్లు ఆయన వెంట తిరుగుతూ చెమటోడ్చుతున్నారు. విజయనగర జిల్లా బాధ్యమంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ అభ్యర్థి తరఫున ప్రచారంలో సక్రమంగా పాల్గొనలేకపోతున్నారు. నామినేషన్‌ రోజు, మొన్న హొసపేటెలో జరిగిన కార్యకర్తల సమావేశానికి మాత్రమే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు. బళ్లారి జిల్లా నుంచి ఎక్కువ ఆధిక్యం ఇస్తామని మంత్రి బి.నాగేంద్ర, విజయనగర నుంచి ఎక్కువ ఆధిక్యం ఇస్తామని మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ను స్వయంగా సవాల్‌ స్వీకరించారు. అది అంత సులభం కాదని ఇద్దరు అమాత్యులకూ తెలుసు. 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కంచుకోటగా మారిన బళ్లారిని తిరిగి కాంగ్రెస్‌ గుప్పిట్లోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫలితం మాత్రం దక్కడంలేదు. 2004లో కరుణాకర రెడ్డి, 2009లో జె.శాంత భాజపా నుంచి బళ్లారి లోక్‌సభ క్షేత్రంలో గెలిచారు. 2014లో శ్రీరాములు భాజపా నుంచి గెలిచి 2018లో రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఉగ్రప్ప గెలవడంతో బళ్లారి కోట కాంగ్రెస్‌ స్వాధీనంలోకి వచ్చిందని ఆ పార్టీ నాయకులు సంతోషిస్తుండగానే 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ భాజపా అభ్యర్థి దేవేంద్రప్ప విజయం సాధించారు. సుమారు 20 ఏళ్లు బళ్లారి లోక్‌సభ క్షేత్రంలో కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ బళ్లారి జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. అదే ఉత్సాహంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటే బళ్లారి కోట కాంగ్రెస్‌ పరమవుతుందని ఆ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించే పూర్తి బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. దానికి తోడు మాజీ ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించి తమ సత్తా చాటుకోవాలని ఇద్దరు మంత్రులు పలు కసరత్తులు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని