logo

బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం

ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది.

Published : 23 Apr 2024 02:20 IST

యశ్వంతపురలో డాక్టర్‌ మంజునాథ్‌తోపాటు దళపతి కుమారస్వామి ప్రచారం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. ఎన్‌డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం బరిలో దిగినప్పుడు కనిపించి సందడి.. ఆపై ప్రత్యర్థి ఎత్తుగడల క్రమంలో కనిపించడం లేదు. రాజకీయ అనుభవంతో పాటు ఆర్థిక, అంగ బలమున్న కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేష్‌ ఆయన ప్రత్యర్థి కావడంతో విజయం ఏమంత సులువైన అంశం కాదనే విషయాన్ని గుర్తించారు. సురేశ్‌కు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌- మంజునాథ్‌ తరఫున మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ నేరుగా ప్రచారాన్ని భుజానికెత్తుకోవడమే పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఈ రెండు కుటుంబాల మధ్య పోరు నువ్వా-నేనా అన్నంత హోరెత్తిస్తోంది. గ్రామీణ నియోజకవర్గంలోనే శివకుమార్‌ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. నాలుగో సారి విజయం కోసం డీకే బ్రదర్స్‌ శ్రమటోడుస్తున్నారు. బెంగళూరు గ్రామీణ, రామనగర, తుమకూరు జిల్లాల పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నియోజకవర్గం విస్తరించింది. అందులో ఆరు చోట్ల కాంగ్రెస్‌, రెండింట ఎన్‌డీఏ నేతలు ఎమ్మెల్యేలుగా సేవఅందిస్తున్నారు. వారివారి అభ్యర్థుల విజయ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. శివకుమార్‌ ప్రాతినిధ్యం వహించే కనకపుర ఇందులో ఒకటి. సోదరుడి విజయం ఆయనకు పెద్దసవాల్‌. ఈసారి అన్ని రకాల ఎత్తుగడలూ ఎంచుకుని ముందుకెళుతున్నారు. ఏదోలా ఒప్పించి బీఎస్‌పీ అభ్యర్థి చెన్నప్పను బరిలోంచి తప్పించడమూ అందులో భాగమేననే ప్రచారం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే చెన్నపట్టణలో జనతాదళ్‌ నేతలు, కార్యకర్తలను భారీగా కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. మచ్చలేని వ్యక్తిగా పేరున్న మంజునాథ్‌కు రాజకీయాలు పూర్తిగా కొత్తకావడంతో దళపతి దేవేగౌడ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన బావమరిది కుమారస్వామి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘ప్రచార బాధ్యతలన్నీ కుమారస్వామి, దేవేగౌడ చూసుకుంటారు’ అంటూ అభ్యర్థి పలుమార్లు ప్రకటించడం ప్రస్తావనార్హం. పోటీ పడుతున్న ఇద్దరూ ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన వారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో మైనార్టీలు, దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువ. వారు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆపార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని