logo

హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట

జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు.

Updated : 23 Apr 2024 07:11 IST

కిరాయి ఇచ్చిన నిందితుడు
గదగ, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, తన సోదరుడ్ని చంపాలని ప్రకాశ్‌ బాకళె, సునంద పెద్ద కుమారుడు వినాయక్‌ బాకళెలను హత్య చేసేందుకు రూ.65 లక్షలకు కిరాయి మాట్లాడుకున్న వారి కుమారుడు వినాయక్‌ రూ.2 లక్షలు బయానా ఇచ్చాడు. అదే సమయంలో వారింటికి వచ్చిన సమీప బంధువులు పరశురామ్‌ హాదిమని (55), ఆయన భార్య లక్ష్మీ హాదిమని (47), వారి కుమార్తె ఆకాంక్ష (17), సునంద బాకళె చిన్న కుమారుడు కార్తిక్‌ (28)లను హంతకులు కడతేర్చి పరారయ్యారు. సునంద, ప్రకాశ్‌ తమ పడకగదిని బంధువులకు ఇచ్చి మరో గదిలో పడుకోవడంతో వారి ప్రాణాలు మిగిలాయి. మహారాష్ట్రకు చెందిన ఫయాజ్‌, అతని అనుచరులు హత్య చేశారని విచారణలో గుర్తించి, వారి కోసం గాలింపు తీవ్రం చేశారు. నగర సభ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్‌ బాకళె, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు సునంద బాకళెకు కార్తిక్‌ బాకళె ఒక్కడే కుమారుడు. ప్రకాశ్‌ మొదటి భార్యకు వినాయక్‌, దత్తాత్రేయ, మరో కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లింది. రెండో కుమారుడు దత్తాత్రేయ నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి వంచించిన పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. గదగ, ముండరగి, బెంగళూరుతో పాటు పలు బ్యాంకులకు రూ.45 కోట్లు వంచించిన కేసులు ఉన్నాయి. తనకు చెడ్డ పేరు తెచ్చావంటూ దత్తాత్రేయను ఇంటి నుంచి దూరంగా ఉంచాడు. పోలీసులు అరెస్టు చేస్తారని దత్తాత్రేయ పరారయ్యాడు. ఇంట్లో వినాయక, కార్తిక్‌, తన రెండో భార్యతో కలిసి ప్రకాశ్‌ ఉంటున్నారు. తల్లిదండ్రులు, తన సోదరుడ్ని హత్య చేయిస్తే ఆ నేరం పరారీలో ఉన్న దత్తాత్రేయ మీదకు వెళుతుందని వినాయక్‌ భావించాడు. కిరాయి మాట్లాడుకుని తల్లిదండ్రులు, సోదరుడు ఉండే గది వివరాలను ఫయాజ్‌కు చెప్పాడు. ఏప్రిల్‌ 19న వేకువ జామున హంతకులు ఇంటికి చేరుకున్నారు. ప్రకాశ్‌, సునంద పడుకునే గదిలో బంధువులు పడుకున్నారు. ఆ దంపతులు, వారి కుమార్తెను, మరో గదిలో పడుకున్న కార్తిక్‌ను హత్య చేసి నిందితులు పరారయ్యారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. తన మొదటి భార్య రెండో కుమారుడు దత్తాత్రేయ కానీ, అతని చేతిలో వంచనకు గురైన వారే ఈ హత్యలు చేసి ఉంటారని ప్రకాశ్‌ మొదట భావించారు. తాను నమ్ముకున్న పెద్ద కుమారుడు వినాయక్‌ హత్య చేయించాడని తెలుసుకుని నిర్ఘాంత పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని