logo

రైతులకు అండగా ఉంటాం: నామా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస  అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

Published : 23 Apr 2024 02:21 IST

రైతులతో మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస  అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చట్టం చేయాలని పార్లమెంటులో కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో సాగునీరందక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. గద్దెనెక్కేందుకు కాంగ్రెస్‌ పార్టీ  ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. దోరేపల్లి శ్వేత, మాటేటి నాగేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, సతీష్‌, నరేష్‌, శ్రీశైలం, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కందాళ ఓటమి బాధించింది..

ఖమ్మం గ్రామీణం: కాంగ్రెస్‌ మాయమాటల వల్లే పాలేరులో తప్పు జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కందాళ ఉపేందర్‌రెడ్డి ఓటమి తననెంతో బాధించిందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పల్లెగూడెంలో నిర్వహించిన భారాస మండల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. గత ఎంపీ ఎన్నికల్లో పాలేరులో అత్యధికంగా 34 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని గుర్తుచేశారు. రైతులు బాగుండాలనే చక్కెర పరిశ్రమ నష్టాల్లో ఉన్నా కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో భారాస ఓటమి తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో నామాను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పాలనలో  కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.

 ప్రజలెందుకు ఇలా చేశారో..: కందాళ

గత అయిదేళ్లలో ఓ ఒక్క రోజూ ప్రజలకు దూరంగా లేనని, పాలేరును రాజకీయంగా ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. నాయకుల అతి విశ్వాసం వల్లే నష్టపోయామని తెలిపారు. ఇప్పటికీ ప్రజలు తనకు ఫోన్‌ చేసి సమస్యలు వివరిస్తున్నారని, బహుశా తాను ఇంకా ఎమ్మెల్యేనే అని అనుకుంటున్నారని వివరించారు. ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ సభ్యుడు యండపల్లి వరప్రసాద్‌, పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ లక్ష్మణ్‌నాయక్‌  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని