logo

అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు

రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు.

Published : 28 Apr 2024 01:26 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. కానీ సీఎం స్పష్టమైన హామీ ఇవ్వటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులు మాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.

పంట రుణ పరిమితి ప్రకారం..

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), గ్రామీణ వికాస్‌ బ్యాంకు(ఏపీజీవీబీ), స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు ఇలా మొత్తం 28 ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు పంట రుణాలు మంజూరుచేస్తున్నాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (పంట రుణ పరిమితి) ప్రకారం ఆయా బ్యాంకులు రైతులకు ఏటా వానాకాలం, యాసంగిలో పంట రుణాలు ఇస్తాయి. పంటలు పండిన తర్వాత బ్యాంకులు నిర్దేశించిన సమయానికి వడ్డీతో సహా రైతులు రుణాలు చెల్లించాలి. ఉభయ జిల్లాల్లో అధిక శాతం రైతులకు రుణాలను డీసీసీబీ, ఏపీజీవీబీ, ఎస్‌బీఐ మంజూరు చేస్తున్నాయి.

కటాఫ్‌ తేదీపై ఉత్కంఠ

పంట రుణాల మాఫీ విషయంలో కటాఫ్‌ తేదీ అనేది ముఖ్యం. ఏ తేదీని సర్కారు పరిగణనలోకి తీసుకుంటుందనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని నెలలుగా డీసీసీబీ, సహకార సంఘాలు రైతుల నుంచి సుమారు 95 శాతం రుణాలు వసూలు చేశాయి. వసూళ్లలో ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏపీజీవీబీ సైతం బకాయిలు ఉన్న రైతులకు నోటీసులు జారీ చేసింది. చాలామంది రైతులు తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పినా డీసీసీబీ, ఏపీజీవీబీ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇవన్నీ రెగ్యులర్‌గా ఇచ్చిన రుణాల జాబితాలో చేరాయి. డిసెంబరు 9ని కటాఫ్‌ తేదీగా తీసుకుంటే ఇప్పుడు రెన్యువల్‌ అయిన రుణాలకు మాఫీ వర్తించే అవకాశం ఉండబోదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం మార్చిని కటాఫ్‌ తేదీగా పరిగణిస్తేనే రూ.2లక్షల రుణమాఫీ పథకం వర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కటాఫ్‌ తేదీ ప్రకటించాకే ఎంతమంది రైతులకు ఎంతమేర రుణం మాఫీ అవుతుందనే విషయంపై స్పష్టత రానుంది. గతంలో రూ.లక్ష రుణమాఫీకి సంబంధించి అప్పటి భారాస సర్కారు 2018 నవంబరు 11న ప్రకటన చేసింది. అదే తేదీని కటాఫ్‌గా తీసుకుంది. ఇప్పుడు సీఎం రేంవత్‌రెడ్డి ఏనిర్ణయం తీసుకుంటారోనని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని