logo

టీటీలో జిల్లా మేటి!

క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి.

Published : 29 Apr 2024 01:28 IST

జిల్లా క్రీడాకారుల బృందం

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే: క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. ఇక్కడి పోటీల ద్వారా టేబుల్‌ టెన్నిస్‌(టీటీ) రంగంలో వచ్చిన మార్పులు స్పష్టమయ్యాయి. టోర్నీలో 300 మంది పాల్గొంటే అందులో 72 మంది ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. జిల్లా టీటీ సంఘం చూపిన చొరవ, స్టేడియంలోని శిక్షణా కేంద్రం నుంచి ఎదిగి వచ్చిన యువ ఆటగాళ్లు ప్రతిభావంతంగా రాణించారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో జిల్లా క్రీడాకారిణి ఆ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాదు క్రీడాకారిణిని మొదటి రౌండ్‌లోనే నిలువరించింది. ఈ ప్రగతిని రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం సభ్యులు మంచి ప్రగతిగా కీర్తించారు.

చిన్నారులే కానీ...

జిల్లా జట్టుగా రంగంలో దిగిన 72 మందిలో దాదాపుగా అందరూ 12 ఏళ్లలోపు వారే ఉన్నారు. వారంతా ఆటపై పట్టు సాధించారు. వీరిలో చాలామంది తమ విరామ సమయంలో అంపైరింగ్‌ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సీనియర్‌ క్రీడాకారులు ఆడే మ్యాచులను సైతం వివాదరహితంగా నిర్వహించారు. ఆటపై వీరికి ఉన్న పరిజ్ఞానాన్ని పసిగట్టిన రాష్ట్ర టీటీ సంఘం దాదాపుగా అంపైరింగ్‌ బాధ్యతలు వారికే అప్పగించింది. ఆట, అంపైరింగ్‌లో రాణించిన జిల్లా చిన్నారులు పలువురి అభినందనలు అందుకున్నారు.


రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి మూడు వందల మంది సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యా సంస్థల యాజమాన్య సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఆహ్వానితులు ఒక్కో సమయంలో వచ్చారు. వచ్చిన వారందరితో ఒక్కో రకం ప్రారంభాలు, ఆవిష్కరణలు చేయించారు. వచ్చిన క్రీడాకారుల్లో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారితో పెద్దలు కూడా ఇక్కడికి వచ్చారు. దీంతో ప్రాంగణం కిటకిటలాడింది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్టు జిల్లా టీటీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్‌, సాంబమూర్తి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని