logo

మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?

వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.

Published : 29 Apr 2024 02:00 IST

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. చిన్న నిప్పురవ్వను నిర్లక్ష్యం చేసినా ఒక్కోసారి అది ఘోరమైన అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాల నివారణకు ప్రయత్నించటంతోపాటు ఘటనలు జరిగినప్పుడు తక్షణం స్పందించి నష్ట తీవ్రత తగ్గించటం అగ్నిమాపక శాఖ ప్రధాన విధి. కాలానుగుణ మార్పులకు శాఖ నోచుకోకపోవటంతో ఉభయ జిల్లాల్లో అరకొర వనరులతో సిబ్బంది నెట్టుకొస్తున్నారు. ఫలితంగా నష్ట తీవ్రత పెరుగుతోంది.

ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కూసుమంచి, వైరా, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లిలో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, మణుగూరులో ఇవి పనిచేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు, విస్తీర్ణానికి అనువుగా ఉభయ జిల్లాల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటం సమస్యగా మారింది. దూరాభారంతో చాలాసార్లు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేసరికి నష్టం జరిగిపోతుంది. ఒకే సమయంలో రెండు మూడు ప్రమాదాలు సంభవిస్తే సిబ్బంది కొరత కారణంగా ఏదో ఓచోటకే సకాలంలో వెళ్లగలుగుతున్నారు.


కొత్త కేంద్రాలు ఎప్పుడొచ్చేను?

  •  ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో  గుండాల, కల్లూరు, జూలూరుపాడు (ఏన్కూరు), పాల్వంచ, చర్ల, పెనుబల్లి, బోనకల్లు ప్రాంతాలకు నూతన అగ్నిమాపక కేంద్రాలు అవసరమని ప్రతిపాదనలు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు.
  •  ఏజెన్సీ ప్రాంతం గుండాలకు అగ్నిమాపక కేంద్రం తెస్తామని ఏళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతున్నా సాకారం కాలేదు. ఇల్లెందు నుంచి 70 కి.మీ. దూరంలోని గ్రామాలకు శకటం వచ్చేలోపు ఆస్తులు    బుగ్గిపాలవుతున్నాయి.
  • ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంలో అధిక డిమాండ్‌ దృష్ట్యా ఒకే   స్టేషన్‌లో రెండు శకటాలు ఉంచాలనే ప్రతిపాదనలు వెళ్లాయి.

ఖాళీలు ఇలా..

  • ఒక అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారి, ఇద్దరు లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు, ముగ్గురు డ్రైవర్లు/ఆపరేటర్లు, పదిమంది ఫైర్‌మెన్లు ఇతర కార్యాలయ ఉద్యోగులు ఉండాలి. రెండు జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు.
  • ఇల్లెందు, మధిర, అశ్వారావుపేట, వైరా, పినపాకలో అధికారి పోస్టులు ఖాళీ.
  • రెండు జిల్లాల్లో వందమంది డ్రైవర్లు/ఆపరేటర్లు అవసరం కాగా 17, వంద మంది ఫైర్‌మెన్లకు 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విపత్తుల సమయంలో స్థానికుల సాయం తీసుకోవాల్సి వస్తోంది.
  • కొత్తగా నియమితులైన వారికి మే నెల చివరి వరకు శిక్షణ ఉంటుంది. జూన్‌ మొదటి వారం వరకూ సిబ్బంది కొరతతోనే విపత్తులు ఎదుర్కోవాలి.

శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది అందుబాటులోకి వస్తే పూర్తిస్థాయిలో అవసరాలు తీరుతాయి. ప్రమాదాల సమయంలో టోల్‌ఫ్రీ నంబర్‌ 101, సమీప కేంద్రాల అధికారులకు సమాచారం అందించాలి. వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.

 జయకృష్ణ, ఉభయ జిల్లాల అగ్నిమాపక శాఖ అధికారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని