logo

మహిళా కార్పొరేటర్‌ ఇంటిపై దుండగుడి దాడి

కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్‌ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్‌చల్‌ చేశాడు.

Published : 19 Apr 2024 03:08 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్‌ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్‌చల్‌ చేశాడు. ఆమె గురువారం ఉదయం ప్రచార కార్యక్రమానికి వెళ్లిన సమయంలో దుండగుడు శుద్ధజల క్యాన్లు ఉన్న ఆటో నడుపుకొంటూ ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. గేటు తీసుకొని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. గట్టిగా కేకలేస్తూ శ్వేతారెడ్డి ఎక్కడికెళ్లిందంటూ వీరంగం సృష్టించారు. ఇంట్లో ఉన్న ఆమె తల్లి హడలిపోయి తలుపు మూసేయడంతో వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని తల్లి శ్వేతరెడ్డికి ఫోన్‌లో చెప్పగా ఆమె వెంటనే కర్నూలు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఫుటేజీని పోలీసు అధికారులకు ఇచ్చారు. పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకోవటం సంచలనంగా మారింది. శిల్పా నందనవనం కాలనీలోని శుద్ధజల కేంద్రంలో పనిచేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారని తెలిసింది. డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక, శ్రీధర్‌రెడ్డి దంపతులకు.. కార్పొరేటర్లు శ్వేతారెడ్డి, నారాయణరెడ్డికి మధ్య అంతర్గత వైరం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ఉదయం జరిగిన ఘటనను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని