logo

జగనన్న పాలన.. అంగన్‌వాడీల వేదన

తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4500 తర్వాత రూ.7వేలు ఆ తర్వాత రూ.10,500లకు పెంచారు.

Updated : 28 Apr 2024 04:44 IST

చంద్రబాబు హయాంలో పెంచింది రూ.6 వేలు
వైకాపా పెంచింది రూ.వెయ్యే


నాడు చంద్రబాబు హయాంలో..

తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4500 తర్వాత రూ.7వేలు ఆ తర్వాత రూ.10,500లకు పెంచారు. ఆయాల వేతనం రూ.2,200 , తర్వాత రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచారు.

నేడు జగన్‌ ప్రభుత్వంలో..

ప్రతిపక్షనేతగా జగన్‌ ఉన్నప్పుడు అంగన్‌వాడీలకు తక్కువ వేతనాలిస్తున్నారని, వారి బాగోగుల్ని పట్టించుకోవడం లేదని ఎక్కడికక్కడ ఊదరగొట్టేలా మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరి జీవితాలు బాగు చేస్తామని, తెలంగాణలో కన్నా ఎక్కువ వేతనాలిచ్చి వారి బతుకుల్ని కాంతిమయం చేస్తామని ఆశలు కల్పించారు. అంగన్‌వాడీల ఓట్లతో గద్దెనెక్కిన వెంటనే కార్యకర్తలకు రూ.10,500 నుంచి కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచగా, ఆయాలకు రూ. 6 వేల నుంచి రూ.7 వేలు పెంచి చేతులు దులిపేసుకున్నారు.


మాటలతో బురిడీ కొట్టించే అలవాటున్న జగన్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు వ్యత్యాసం ఉందని అంగన్‌వాడీ కార్యకర్తలు బాహాటంగా చెబుతున్నారు.  మహిళా, శిశుసంక్షేమంపై ఏ ప్రభుత్వమైనా ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటలకు, అధికారం చేపట్టాక ఆయన వ్యవహర శైలికి మార్పులు జరిగాయని అంగన్‌వాడీలు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరెంటు, బస్‌ఛార్జీలు పెరిగాయి. జీవనవ్యయం మొత్తంగా రెట్టింపైంది. అయినా ఆదాయం జానెడు, ఖర్చు బారెడులాగా అంగన్‌వాడీల జీవితాలు తయారయ్యాయి. పైగా వీరిపై పనిభారం పెరిగింది. నాణ్యతలేని ఫోన్లు ఇచ్చి, అందులో పని చేయని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయించారు. లబ్ధిదారులను తగ్గించేందుకు పోషణ ట్రాకర్‌ యాప్‌ను ప్రవేశపెట్టారు. గర్భిణులకు, బాలింతలకు ఫేస్‌ యాప్‌ పెట్టి పోషకాహారం అందించే ప్రక్రియలో అంగన్‌వాడీలు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. సిగ్నల్‌్్స అందక, సర్వర్‌ పనిచేయక చాలా మంది లబ్ధిదారులకు పోషకాహారం అందనిస్థితి నెలకొంది.

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

ప్రధాన డిమాండ్లు ఇవీ...

  • ఉద్యోగ విరమణ ప్రయోజన మొత్తాన్ని రూ.1.2 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చినా దానికి సంబంధించిన ఉత్తర్వు విడుదల చేయలేదు. ఉద్యోగ విరమణ వయస్సును 62కు పెంచుతామని ఇచ్చిన హామీపై కూడా ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. మినీ కార్యకర్తలను మెయిన్‌ కార్యకర్తలుగా మారుస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు, మట్టి ఖర్చులకు రూ.20 వేల చెల్లింపు తదితర హామీలపై జీవోలు విడుదల చేయలేదు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ అందలేదు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో ఏమో అంటూ అంగన్‌వాడీలు నిట్టూర్పులు విడుస్తున్నారు.
  • అంగన్‌వాడీలు నెలలో రెండుమార్లు ఐసీడీఎస్‌ కార్యాలయ సమావేశాలకు హాజరవ్వాలి. ఇందుకు సంబంధించిన టీఏ, డీఏలు చెల్లింపులు చేయకుండా ప్రభుత్వం వేధిస్తోంది. మరోవైపు ఒక పిల్లాడికి పోషకాహారం వండి పెట్టేందుకు రోజుకు రూ.2 మాత్రమే ఇస్తోంది. గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వంట ఖర్చును రూ.2 నుంచి రూ.5లకు పెంచాలని అంగన్‌వాడీలు డిమాండు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో వినతిపత్రాలిచ్చినా...

పెరిగిన జీవన వ్యయం ప్రకారం కుటుంబపోషణ కష్టమవుతోందని, కనీసవేతనాలు పెంచాలని మూడేళ్లుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పోరాడుతూనే ఉన్నారు. వివిధ రూపాల్లో వినతిపత్రాలిచ్చి..తమను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెనోటీసు ఇచ్చినా..ప్రభుత్వం తూతూమంత్రంగా మాట్లాడి వారి డిమాండ్లను నెరవేర్చలేదు.  డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు 42 రోజుల పాటు  ఉద్యమంబాట పట్టి హోరెత్తించినా ప్రభుత్వం స్పందించలేదు. అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్లెక్కారు...రాస్తారోకోలు చేశారు. వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కలెక్టరేట్ల ఎదుట  నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించలేదు. తమకు కనీస వేతనాలిప్పించాలనే వారి విన్నపాన్ని పట్టించుకోలేదు. ఒకవైపు ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసి భయపెట్టేందుకు ప్రయత్నించినా వారు వెనకడుగు వేయలేదు. ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినా వెనుకంజ వేయలేదు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం భయపెట్టడంతో కొందరు విధుల్లో చేరినా ఇంకొందరు మాత్రం సమ్మె కొనసాగించారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేయించి నిర్వహణ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. తాము అపురూపంగా చూసుకునే అంగన్‌వాడీ కేంద్రాల బాధ్యతను ఇతరులకు అప్పగించడాన్ని కార్యకర్తలు తమను అగౌరపరచడంగా భావించారు. కొందరు అంగన్‌వాడీలపై ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయించింది. ప్రతిపక్షం చేతుల్లో కీలుబొమ్మల్లా మారారంటూ వారిపై విషప్రచారాన్ని ప్రభుత్వం చేయించింది. ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో దిగివచ్చి వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. స్పష్టమైన హామీ ఇవ్వకున్నా అంగన్‌వాడీలు సమ్మె విరమించారు.


లెక్కల్లో ఇలా...

ప్రాజెక్టులు: 16
ఉమ్మడి జిల్లాలో
అంగన్‌వాడీ కేంద్రాలు: 3549
పని చేస్తున్న ఆయాలు,
కార్యకర్తలు: 7098


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని