logo

నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు

విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు.

Published : 29 Apr 2024 02:35 IST

స్థలం ఉన్నా.. నిధుల లేమి

 

ఆలూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. ప్రభుత్వ కళాశాలలు, గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు నిర్మించకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఆలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన గురుకుల బాలికల విద్యాలయం ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాలకు నోచుకోవడం లేదు. దీంతో చాలీ చాలని గదుల్లో విద్యనభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆలూరుకు 1987లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. అప్పట్లో కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో.. తాత్కాలికంగా ప్రభుత్వ బాలుర రెండో ఉన్నత పాఠశాల పైఅంతస్థులోని మూడు అదనపు తరగతి గదులు కేటాయించారు. అందులో ఒకటి ప్రధానాచార్యులు, మరొకటి అధ్యాపకులు తీసుకున్నారు. విద్యార్థులకు కేవలం ఒక గది మాత్రమే మిగిలింది. ఉన్న ఒక గది, వండాలో కొన్నేళ్ల పాటు విద్యార్థులకు విద్యనందించారు. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుండటంతో పదేళ్ల కిందట మరో మూడు గదులు కేటాయించారు. అయితే కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో కేవలం బీఏ కోర్సుతోనే నెట్టుకొస్తున్నారు. ఇతర కోర్సుల్లో చేరే విద్యార్థులు ప్రైవేటు కళాశాలను ఆశ్రయిస్తున్నారు. ఓ దాత స్థలం ఇచ్చినా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఏళ్లుగా పాఠశాల అదనపు తరగతి గదుల్లోనే నిర్వహిస్తున్నారు.

అక్కడే పాఠాలు.. భోజనాలు

2016లో ఆలూరుకు గిరిజన గురుకుల బాలికల పాఠశాలను మంజూరు చేశారు. సొంత భవనం లేక అప్పట్లో బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన భవనంలో 12 గదులు కేటాయించారు. అందులో ఒక గదిని వంటకు, మరో రెండు గదులు ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులకు, మరో గదిని డిజిటల్‌ తరగతుల నిమిత్తం కేటాయించారు. దీంతో విద్యార్థులకు 8 గదులే మిగిలాయి. పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం గదులు లేకపోవడంతో ఇరుకుగా కూర్చొని చదువు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులకు నిద్రించేందుకు, భోజనం చేసేందుకు డైనింగ్‌ హాలు లేకపోవడంతో తరగతి గదుల్లోనే తిని, నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని