logo

జగనన్నా.. న్యాయం ఏదన్నా..

మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

Updated : 30 Apr 2024 06:40 IST

 మహిళలను ఆదుకోని ప్రత్యేక పోలీసుస్టేషన్లు
నిందితులపై కానరాని చర్యలు
కర్నూలు  నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే

మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దిశా చట్టం అమలు చేస్తున్నామని.. నిందితులకు తక్షణం శిక్షలు అమలవుతాయని పేర్కొన్నారు. కొద్దిరోజులపాటు నానా హంగామా సృష్టించారు. ఆ తర్వాత షరామామూలే. కేసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా తీసుకుంటున్న చర్యలు శూన్యమే.

మహిళలకు న్యాయం చేసే ఉద్దేశంతో కర్నూలులోని పాత మహిళా పోలీసుస్టేషన్‌ను ఆధునికీకరించి దిశా మహిళా పోలీసుస్టేషన్‌గా మార్చారు. కొత్త జిల్లా ఏర్పడినప్పుడు నంద్యాల జిల్లాలోనూ మరో పోలీసుస్టేషన్‌ ఏర్పాటైంది. ఈ స్టేషన్లకు ప్రత్యేకంగా వాహనాలు కేటాయించారు. ఏర్పాటుచేసిన కొత్తలో కొద్దిరోజులపాటు పోక్సో, అత్యాచారం కేసులను పర్యవేక్షించడం, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత ఈ స్టేషన్లు భార్యాభర్తల వివాద కేసులకే పరిమితమయ్యాయి. మంత్రణం చేసి రాజీ చేయడం.. లేదంటే కేసులు నమోదు చేయడం వంటి విధులకే పోలీసులు పరిమితమయ్యారు. కొద్దిరోజుల కిందట కర్నూలు దిశా పోలీసుస్టేషన్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. అన్యాయానికి గురైన ఓ కలెక్టరేట్‌ ఉద్యోగిని కర్నూలు దిశా స్టేషన్‌ను ఆశ్రయించగా పోలీసు అధికారులు అవమానించడంతో భరించలేక ఈ ఏడాది జనవరిలో మానవ హక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

యాప్‌ పేరుతో హంగామా..

ఆపద సమయాల్లో మహిళలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన దిశా యాప్‌ పరిస్థితి ఇలానే ఉంది. దీనిపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. జనాన్ని ముప్పుతిప్పలు పెట్టి మహిళల సెల్‌ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఈ యాప్‌తో పెద్దగా ఫలితం లేకపోయింది. దిశా చట్టం అమలులోకి వస్తుందని నాలుగేళ్లుగా చెబుతున్నా అమలులోకి రాలేదు. అత్యాచారం జరిగిన 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, దిశా యాప్‌ ఉంటే భద్రత ఉన్నట్లేనని జగన్‌ చెప్పిన మాటలు ఉత్తమాటలేనని తేలిపోయింది.

కొన్ని ఘటనలు

  •  2020 ఆగస్టులో గోనెగండ్ల మండలం ఎర్రబాడుకు చెందిన హజరబీ మృతి చెందగా కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. పొలానికి వెళ్లిన ఈ యువతి విగతజీవిలా మారింది. హత్యాచారానికి గురైనట్లు మృతురాలి సోదరుడి ఫిర్యాదుమేరకు గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
  •  గతేడాది ఫిబ్రవరిలో కోడుమూరు పరిధిలో ఓ ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకు ఉన్న దంపతుల కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఇటీవల కర్నూలులోని ఓ కాలనీకి చెందిన బాలుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
  •  రెండు నెలల కిందట బండిఆత్మకూరు మండల పరిధిలో 30 ఏళ్ల యువతిని వైకాపా నేత అనుచరులు అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది.

వారు ఏం చేస్తున్నారు?

మహిళల సమస్యలు తెలుసుకొని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి న్యాయం చేసి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రతి వార్డు, గ్రామ సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులను నియమించారు. ఉమ్మడి జిల్లాలో 1,190 మందిని నియమించారు. ఉద్దేశం బాగానే ఉన్నా సరైన ప్రణాళికలు రూపొందించకపోవడంతో వారితో మహిళలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. కొద్దిమంది మాత్రమే పలు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నా అధిక శాతం మంది మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. చివరికి దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించే విధులకు పరిమితమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని