logo

పుర జనం గొంతులో గరళం

ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్‌ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

Published : 19 May 2024 06:17 IST

కలుషిత మవుతున్న మంచినీరు
మొక్కుబడిగా శుద్ధి ప్రక్రియ
లీకేజీలను పట్టించుకోని అధికారులు

ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్‌ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ‘న్యూస్‌టుడే’ బృందం కర్నూలు, నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు పట్టణాల్లో శనివారం పరిశీలించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. పలు చోట్ల ట్యాంకులను నెలల పాటు   శుభ్రం చేయడం లేదు. క్లోరినేషన్‌ ప్రక్రియ సక్రమంగా చేపట్టడం లేదు..మంచినీటి పైపులైన్లు రోజుల పాటు లీకేజీలవుతున్నా పట్టించుకోవడం లేదు.

 కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, డోన్, ఆదోని, ఆత్మకూరు, ఎమ్మిగనూరు పురపాలకం, న్యూస్‌టుడే


మురుగు కలుస్తోంది

ఆత్మకూరు పట్టణానికి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, విద్యుత్తు బోర్లు, అద్దె బోర్ల నుంచి నీటిని అందిస్తున్నారు. సంగమేశ్వరం సర్కిల్‌లో మసీదు ఎదురుగా పైపులైన్‌ మూడు నెలల నుంచీ లీకేజీ అవుతున్నా పుర అధికారులు పట్టించుకోవడం లేదు.. కేవలం రబ్బరు పైపు చుట్టి మమ అనిపించారు. స్వరాజ్‌నగర్, ఇందిరానగర్, అర్బన్‌కాలనీ, ఎబీఎంపాలెం, గొల్లపేట, తోటగేరి, పెద్దబజారు, రహ్మత్‌నగర్, ఏకలవ్యనగర్‌ తదితర  ప్రాంతాల్లో  రంగుమారిన నీళ్లు వచ్చాయి. స్వరాజ్‌నగర్‌కు గరీబ్‌నగర్‌ ట్యాంకు నుంచి నీటిని అందిస్తున్నా పైపులైను లీకేజీల కారణంగా కలుషితమవుతోంది. ఎబీఎంపాలెంలో పబ్లిక్‌ కుళాయి పైపుల అడుగు భాగం దెబ్బతినడంతో మట్టితో కూడిన నీరు వస్తోంది. సాయిబాబానగర్‌కు వెళ్లే మార్గం, వెంకటేశ్వరస్వామి, జమ్ములమ్మ ఆలయాలు, రఘునాథ్‌ సెంటర్లో తరచూ పైపులైన్లు లీకవుతున్నాయి.  


డోన్‌.. లీకేజీ మయం

డోన్‌ పట్టణంలో 75వేలకు పైగా జనాభా నివాసం ఉంటోంది.. గాజులదిన్నె జలాశయం నుంచి నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి కుళాయిలకు సరఫరా చేస్తున్నట్లు పుర అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే నీరు సరిగా రావడం లేదు.. వచ్చినా భరించలేని వాసన ఉంటోంది.. తాగలేకపోతున్నామని కొత్తబస్టాండు, శ్రీరామానగర్, జంగాలకాలనీ, వైఎస్సార్‌ నగర్, సుందర్‌సింగ్‌ కాలనీ, టీచర్స్‌కాలనీ తదితర కాలనీ ¦సులు వాపోతున్నారు. దొరపల్లె బ్రిడ్జి సమీపంలో పైపులైన్‌ లీకేజీకి గురైంది.. రెండు నెలలు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్త బస్టాండు పక్కనున్న వీధి, నెహ్రూనగర్‌లోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల వద్ద పెద్ద ఎత్తున లీకేజీ అవుతోంది. వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కనున్న వీధిలో వాల్వులు లీకేజీకి గురై నీరువృథా అవడంతో పాటు నీరు కలుషితమవుతోంది.


రూ.కోటి నిధులు ఏమవుతున్నాయి

కర్నూలు నగరంలోని 52 వార్డుల్లో 6.5 లక్షల జనాభా నివాసం ఉంటోంది.. నీటి శుద్ధికి ఏటా రూ.1.50 కోట్లు వెచ్చిస్తున్నా మంచినీరు అందించలేకపోతున్నారు. కలుషిత నీటిని తాగి జనాలు రోగాల బారిన పడుతున్నారు. గతేడాది లక్ష్మీపురంలో కలుషిత నీటిని తాగి 150 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. కొన్ని రోజులుగా నగరంలో బురదరంగుతో కూడిన నీరు వస్తోంది. సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం గాజులదిన్నె జలాశయం నుంచి సరఫరా చేస్తున్నారు. నీరంతా బురదరంగులో ఉంటోంది. నీటిని సక్రమంగా శుద్ధి చేయడం లేదు. కల్లూరు కాలనీల్లోని శరీన్‌నగర్, ముజఫర్‌నగర్, బళ్లారిచౌరస్తా, నంద్యాల చెక్‌పోస్టు, గణేశ్‌నగర్‌ కాలనీలు, నగరంలోని బుధవారపేట, పాతనగరం తదితర కాలనీల్లో మంచినీరు కలుషితంగా సరఫరా అవుతోంది.


ఆదోనిలో బురద.. బురద

బసాపురం నీటి కుంట మార్గంలో  

ఆదోని పట్టణంలోని 42 వార్డుల్లో రెండు లక్షల మంది నివాసం ఉంటున్నారు. నీటిశుద్ధి కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా.. గొట్టాల లీకేజీల కారణంగా కలుషిత నీరే సరఫరా అవుతోంది. రెండేళ్ల కిందట  రంగుమారిన నీటిని తాగి ఓ వ్యక్తి మృతిచెందారు. హాన్సాజీపేట, విక్టోరియాపేట, ఎల్‌బీ.వీధి, చౌకీమఠం తదితర ప్రాంతాలకు శనివారం సరఫరా అయిని నీరంతా బురదమయంగా ఉంది.. రంగుమారి దుర్వాసన వస్తోంది. బసాపురం నీటి కుంటతో పాటు రాంజల చెరువు ప్రాంతంలో నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. బసాపురం నీటి కుంట నుంచి శివారులోని మార్కెట్‌ యార్డు వరకు వచ్చే మార్గంలో ప్రధాన నీటి సరఫరా గొట్టానికి 10-12 భారీ లీకేజీలున్నాయి. లీకేజీల నివారణకు ఏటా రూ.4-5 లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.


నంద్యాలలో రంగు మారుతోంది

వివేకానందనగర్‌లో మంచినీటి పరిస్థితి

నంద్యాల పట్టణంలో 42 వార్డుల్లో మూడు లక్షల జనాభా నివాసముంటోంది. 63 వేల నివాస గృహాలు ఉన్నాయి. 21 వార్డులకు నిత్యం నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రోజు మార్చి రోజు ఇస్తున్నారు. మహానంది రోడ్డులోని హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద శుద్ధి చేసి కుళాయిలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరిగా శుద్ధిచేయకపోవడంతో దుర్వాసనతో కూడి రంగుమారి వస్తున్నాయి. గత కొంతకాలంగా మట్టితో కూడిన నీళ్లు వస్తున్నాయని విశ్వనగర్, వివేకానందనగర్, దేవనగర్, వీసీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పలు కాలనీలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు.


చేనేతపురిలో వాసనొస్తోంది

ఎమ్మిగనూరులో పట్టణంలోని 34 వార్డుల్లో 1.23 లక్షల జనాభా నివాసం ఉంటోంది. లక్ష్మీపేట, తేరుబజార్, సంజీవయ్యనగర్, ఇందిరానగర్, కమిటీ రోడ్డు, షరాఫ్‌బజార్, ముగతిపేట, ఎన్‌టీఆర్‌ కాలనీ, శివన్ననగర్, టీచర్స్‌కాలనీ, సోగనూరు రోడ్డు, ఎస్సీకాలనీ, చిన్నకమేలా, పెద్దకమేలా వీధి, పాతహరిజనవాడ, హుసేనప్పకాలనీ, కల్లుగట్లరోడ్డు, చంద్రయ్యకొట్టాల, వడ్డెసంఘం, కబరస్తాన్‌కొట్టాల, శాంతినగర్, పంపన్నగౌడు కాలనీ, సాయిగణేష్‌కాలనీ తదితర కాలనీలకు శనివారం నీటిని విడుదల చేశారు. పలుచోట్ల రంగుమారిన నీరు సరఫరా అయ్యింది. పార్కు రోడ్డు, బంగారు బజార్, మల్లారవీధి, ముగతిపేట కాలనీల్లో పైపులీకేజీలు ఉన్నాయి. నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని