logo

ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం

పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే.

Updated : 23 Apr 2024 06:11 IST

సాంకేతికంగా ఎంత పురోగమించినా వన్నె తగ్గని పుస్తకం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం: పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. పుస్తక పఠనంతో తమ జీవన గమనాన్ని మార్చుకున్నవారే. టీవీలు వచ్చినా, చరవాణి వినియోగం పెరిగినా, ఎన్ని సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నా పుస్తకాలకు ప్రత్యామ్నాయం కాబోవన్నది అందరూ అంగీకరించే నిజం. అందుకే సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని ఏనాడో చెప్పారు. పుస్తకాలతో ప్రభావితమై ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లు ఎందరో ఉన్నారు. అనేక పుస్తకాలు సేకరిస్తూ తమ ఇంటిలోనే చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ నేపథ్యంలో పలువురిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. పుస్తకాల ప్రాధాన్యం, వారిని ప్రభావితం చేసిన తీరు తదితర వివరాలన్నీ వారి మాటల్లోనే..

ఉన్నత స్థాయిలో నిలబెట్టింది.. : పుస్తకానికి మరణం లేదు.. బతుకు సౌందర్యాన్ని అద్దంలా చూపిస్తుంది. పుస్తకాలు చదివితే జీవిత అనుభవం వస్తుంది. 2016 నుంచి కథలు, కవిత్వం, నవలలు, సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు 400 వరకు సేకరించాను. జి.లక్ష్మీనర్సయ్య రచించిన ‘కవిత్వం - చర్చనీయాంశాలు’ పుస్తకం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను కవిత్వం, వ్యాసాలు రాయటానికి దోహదపడింది. జూకంటి జగన్నాథం, డా.ఎన్‌.గోపి, శివారెడ్డి, యాకూబ్‌ తదితరుల సాహిత్యాన్ని ఇష్టంగా చదువుతాను. జన జీవనానికి దగ్గరగా ఉండే రచనలను ఇష్టపడతాను. నా రచనలు తీరొక్క పువ్వు(నానీలు), దండ కడియం(కవితా సంపుటి), జల (మామిడి హరికృష్ణతో కవిత్వం ముచ్చట్లు) పుస్తకాలుగా వచ్చాయి. మరో రెండు సాహిత్య పుస్తకాలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయి. నేను పనిచేసే వెల్దండ మండలం అజిలాపురం గ్రామ పాఠశాల విద్యార్థులు రాసిన ‘దేవగన్నేరు’ పుస్తకం త్వరలో ఆవిష్కరిస్తాం. నేను రాసిన ‘దండకడియం’ సంపుటికి 2021లో కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్నాను. పుస్తక పఠనమే నన్ను ఈ స్థాయిలో నిలిపింది.  

తగుళ్ల గోపాల్‌, యువకవి, నాగర్‌కర్నూల్‌


పుస్తకాలు చదివి రచయితనయ్యా : నేను ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా. రోజుకు 2 గంటలైనా ఏదో ఒక పుస్తకం చదువుతాను. పసునూరి రవీందర్‌ రాసిన ‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’ పుస్తకం సామాజిక దృక్కోణంలో నన్ను ఎంతో ప్రభావితం చేసింది. పుస్తకాలను బాగా చదవటం వల్లనే సాహిత్యంపై పట్టు వచ్చింది. కొన్నేళ్లుగా కవిత్వం, కథలు, నాటకాలు రాస్తున్నాను. ‘మరోకోణం’ కవితా సంపుటిని వెలువరించాను. త్వరలో కథల పుస్తకాన్ని ముద్రిస్తాను. శ్రీశ్రీ, రంగనాయకమ్మ, కేశవరెడ్డి, బుచ్చిబాబు, అలిశెట్టి ప్రభాకర్‌, పసునూరి రవీందర్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, గుడిపల్లి నిరంజన్‌ రచనలు నాకు ఎంతో ఇష్టం. సాహిత్యం, రాజనీతి, తాత్వికత, చరిత్రలు, సాహిత్య విమర్శకు సంబంధించి 150 వరకు పుస్తకాలు సేకరించాను. ఇంట్లో గదిని గ్రంథాలయంగా మార్చాను. హైదరాబాద్‌కు వెళ్లిన ప్రతీసారి పుస్తకాలు కొంటాను.

రాము పెరుమాళ్ల, యువకవి, ఊర్కొండ మండలం, మాదారం


మనసును కదిలిస్తుంది.. మనిషిని నడిపిస్తుంది : పుస్తకం మనసును కదిలిస్తుంది.. మనిషిని నడిపిస్తుంది. లోకంలో మంచి మిత్రుడు ఉండకపోవచ్చు. చెడు పుస్తకం మాత్రం ఉండదు. గురువులా వెలుగు పంచుతూ జ్ఞానాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్తుంది. పదేళ్ల నుంచి పుస్తక పఠనం అభిరుచి ఉంది. పుస్తకాల కొనుగోలుకు చేసే ఖర్చు వృథా కాదు. 500 వరకు పుస్తకాలు సేకరించాను. నేను ప్రాచీన సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యం పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఇటీవల ఎన్‌.గోపి రచించిన ‘వృద్ధోపనిషత్‌’ పుస్తకాన్ని చదివాను. ఇది జీవితాన్ని వడపోసింది. జీవిత చరమాంకంలో ఎలా ఉంటామో వివరించింది. కరుణ రసాత్మకమైన కవిత్వాన్ని అందులో చూడొచ్చు. అందరూ చదవాల్సిన పుస్తకం. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలి. సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా పుస్తకానికి విలువ తగ్గలేదు. పిల్లలకు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి.

పుట్టి గిరిధర్‌, కవి, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని