logo

పురపాలికలపై సైబర్‌ నేరగాళ్ల నజర్‌

సైబర్‌ నేరగాళ్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగారు. ట్రేడ్‌ లైసెన్సు ఫీజులు, లేబర్‌ ఛార్జీలు తగ్గిస్తామంటూ అక్రమాలకు తెర లేపారు. బడా వ్యాపారులతో పాటు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాదారులను మోసం చేస్తున్నారు.

Published : 03 May 2024 05:44 IST

లైసెన్సు పునరుద్ధరణ పేరుతో మోసాలు

  • వనపర్తి పట్టణంలోని ఓ వ్యాపార దుకాణ యజమానికి నెల రోజుల కిందట అజ్ఞాత వ్యక్తి ఒకరు ఫోన్‌ చేసి ట్రేడ్‌ లైసెన్సు పునరుద్ధరించుకుంటే రాయితీ వస్తుందని నమ్మబలికాడు. ఇతని మాటలు నమ్మిన యజమాని సదరు వ్యక్తికి రూ.అయిదు వేలు ఫోన్‌ పే ద్వారా పంపించారు. తాను డబ్బులు చెల్లించినట్లు పుర అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తామేమీ ఫోన్‌ చేయలేదని చెప్పడంతో కంగుతిన్నారు.
  • గద్వాల పురపాలికలోని ఓ వ్యాపారికి ఇటీవల అజ్ఞాతవ్యక్తి ఫోన్‌ చేసి ట్రేడ్‌ లైసెన్సు పునరుద్ధరించుకోవాలని చెప్పారు. సదరు వ్యక్తికి యజమాని ఫోన్‌పే ద్వారా నగదు పంపించారు. లైసెన్సు రెన్యూవల్‌ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు సైబర్‌ మోసానికి పాల్పపడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైయస్సార్‌ జిల్లాకు చెందిన బిల్లా నాగేశ్వరావును కటకటాలకు పంపించారు.

 వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : సైబర్‌ నేరగాళ్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగారు. ట్రేడ్‌ లైసెన్సు ఫీజులు, లేబర్‌ ఛార్జీలు తగ్గిస్తామంటూ అక్రమాలకు తెర లేపారు. బడా వ్యాపారులతో పాటు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాదారులను మోసం చేస్తున్నారు. వనపర్తి, గద్వాల పురపాలికల్లో మున్సిపల్‌ ఉద్యోగుల పేరుతో రెండు, మూడు రోజులుగా వ్యాపారులకు ఫేక్‌ కాల్స్‌ వస్తున్నాయి. ట్రేడ్‌ లైసెన్సు ఛార్జీలు చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. గడువులోగా చెల్లించకుంటే దుకాణాలను సీజ్‌ చేస్తామని భయబ్రాంతులకు గురిచేయడంతో కొందరు భయంతో ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు.

ఫిర్యాదులు అంతంతే..

కొందరు వ్యాపారులు సకాలంలో లైసెన్సులను పునరుద్ధరించుకోవడం లేదు. వీరి ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని సైబర్‌ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులకు ఫోన్‌ చేసి పునరుద్ధరణ పేరుతో డబ్బు దండుకుంటున్నారు. మరికొందరు రాయితీ పేరుతో మోసగిస్తున్నారు. ఆశకు పోయిన వ్యాపారులు ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లించి పుర కార్యాలయాలకు వెళ్లి లైసెన్సు పత్రాలివ్వాలంటూ కోరుతున్నారు. చివరకు మోస పోయామని లబోదిబోమంటున్నారు. నష్టపోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయడం లేదు.


మీసేవలో డబ్బు చెల్లించాలి

- పూర్ణచందర్‌, కమిషనర్‌, పురపాలిక వనపర్తి

ట్రేడ్‌ లైసెన్సుల పునరుద్ధరణకు పుర కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తే వ్యాపారులు స్పందించవద్దు. ట్రేడ్‌ లైసెన్సు పన్ను చెల్లించాలంటే మీసేవ లేదా పుర కార్యాలయంలోని సిబ్బందిని కలిసి చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని