logo

కృష్ణానీటిపై జగన్‌తో కేసీఆర్‌ చీకటి ఒప్పందం : యెన్నం

కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేలా జగన్‌తో అప్పటి సీఎం కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

Published : 28 Apr 2024 04:39 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంలో ఎన్పీ వెంకటేశ్‌, నాయకులు

పాలమూరు, న్యూస్‌టుడే : కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేలా జగన్‌తో అప్పటి సీఎం కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం 9 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జగన్‌ తరలించుకుపోతున్నా.. నాడు కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్‌ తీరని ద్రోహం చేశారని విమర్శించారు. కమీషన్ల కోసమే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి కాకుండా డిజైన్‌ మార్చి కృష్ణా తిరుగు జలాల వద్ద చేపట్టారని, అందుకే ఇప్పటికీ 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతోందన్నారు. జగన్‌కు వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని కృష్ణానీటిని తాకట్టు పెట్టారని, తద్వారా దిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావించారని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన కేసీఆర్‌ రుణమాఫీపై మాట్లాడారని, 2018లో భారాస మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి విడతలో రూ.25వేలు మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయని కేసీఆర్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అవుతున్నా.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తే తమ ప్రభుత్వం వాటిని గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పాత బకాయిలు తీర్చుకుంటూ, ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలను అందిస్తున్నామని, ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్పీ వెంకటేశ్‌, చంద్రకుమార్‌ గౌడ్‌, అబ్దుల్‌ సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్‌, రాములు యాదవ్‌, బెనహర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని