logo

అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్‌

జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సంతోష్‌ సూచించారు.

Published : 28 Apr 2024 04:48 IST

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సంతోష్‌ సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీలు, రుమాలు చుట్టుకోవాలని, గొడుగులు వినియోగించాలని పేర్కొన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు కనీసం ఐదు లీటర్ల మంచినీటిని తాగాలన్నారు. ప్రయాణాలు తెల్లవారుజామున ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. నలుపు, ముదురు రంగు, మందంగా ఉండే దుస్తులు కాకుండా, తెలుపు, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. ఆయా కేంద్రాల్లో చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు నీడ కల్పించడమే కాక తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు.


ద్యాగదొడ్డిలో 44.2 డిగ్రీల నమోదు

రాజోలి, న్యూస్‌టుడే: జిల్లాలో సూరీడు మండిపోతున్నాడు. ఈ సీజన్‌లోనే అత్యధికంగా ధరూర్‌ మండలం ద్యాగదొడ్డిలో శనివారం 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజంతా తీవ్రమైన వడగాల్పులు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లో ఉన్న వారు సైతం ఉక్కపోతతో అల్లాడారు. గట్టు మండలకేంద్రంలో 43.4, గద్వాల పట్టణంలో 43.3, రాజోలి, కేటీదొడ్డిలో 43.1, ఇటిక్యాల మండలం కొదండాపురం, వడ్డేపల్లి, అయిజలో 42.8, మల్దకల్‌లో 42.4, అలంపూర్‌లో 42.3 సెల్సియస్‌ డిగ్రీలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలకు పైఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని