logo

పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి

వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.

Published : 28 Apr 2024 05:15 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం, కొత్తకోట

వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. వారు తమదైన పనితీరుతో పదవికే వన్నె తెచ్చి చరిత్రలో నిలిచారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


రాజా రామేశ్వరరావు

విదేశాంగ సేవల నుంచి రాజకీయాల్లోకి.. : రాజా రామేశ్వరరావు 21వ ఏట వనపర్తి సంస్థానాధీశుడిగా నియమితులయ్యారు. స్వాతంత్య్రం అనంతరం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ప్రతిపాదన చేసిన సంస్థానాధీశుడిగా చరిత్రలో నిలిచారు. ఉన్నత విద్య అభ్యసించిన ఆయన 1949లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌లో చేరారు. నైరోబీలో తొలి భారత రాయబారిగా పనిచేశారు. ఘనా, నైజీరియాలకు రాయబారిగా సేవలందించారు. 1958లో ఐరాసకి భారత ప్రతినిధి బృంద సభ్యుడిగా వెళ్లారు. 1954-65లో అల్జీర్‌లో జరిగిన ఆఫ్రో - ఏసియన్‌ కాన్ఫరెన్స్‌కు భారత ప్రతినిధి బృంద సభ్యుడిగా ఉన్నారు. రెండో లోక్‌సభకు ద్విసభ విధానంలో తొలి విడత సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత మూడు, నాలుగు, ఐదో లోక్‌సభకు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ విదేశాంగ వ్యవహారాల సలహా సంఘం, ప్రణాళికా సలహా సంఘంలో సభ్యుడిగా సేవలందించారు. ఏడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో రాజకీయాలను విరమించుకున్నారు.


మల్లికార్జున్‌గౌడ్‌

తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన నేత.. : మెదక్‌ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌ గౌడ్‌ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఓయూ విద్యార్థి నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితి తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం 5వ లోక్‌సభ (1971-77)కు పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచే 6వ లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1980లో మధ్యంతర ఎన్నికలు రాగా ప్రధాని ఇందిరాగాంధీని మెదక్‌ నుంచి పోటీకి ఆహ్వానించారు. ఆయన తొలిసారిగా 7వ లోక్‌సభకు మహబూబ్‌నగర్‌ నుంచి పోటీకి దిగారు. రాజా రామేశ్వర్‌రావు కాంగ్రెస్‌(యు) తరపున పోటీ చేయగా ఆయనపై విజయం సాధించారు. 8వ లోక్‌సభకు పోటీచేసినా ఓడిపోయారు. గెలిచిన ఆయన 9, 10, 11వ లోక్‌సభకు వరుసగా మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. కేంద్ర రైల్వే శాఖ, విద్య, సాంఘిక సంక్షేమ శాఖ, సమాచార, పార్లమెంటరీ వ్యవహారాలు, రక్షణ శాఖల సహాయ మంత్రిగా సేవలందించారు.  


ఎస్‌.జైపాల్‌రెడ్డి

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు : కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గులకు చెందిన జైపాల్‌రెడ్డి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 8వ లోక్‌సభ(1984-89)కు జనతా పార్టీ నుంచి పోటీచేసి మల్లికార్జున్‌గౌడ్‌ ఓడించారు. తర్వాత 12వ లోక్‌సభ(1998-99)కు జనతాదళ్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 16వ లోక్‌సభ(2014-19)కు కాంగ్రెస్‌ నుంచి పోటీచేయగా 2,598 ఓట్ల స్వల్ప తేడాతో భాజపా అభ్యర్థి జితేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్‌ నుంచి రెండుసార్లు, చేవెళ్ల నుంచి ఒకసారి, మిర్యాలగూడ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. ప్రధానులు ఐకే గుజ్రాల్‌, మన్మోహన్‌సింగ్‌ల ప్రభుత్వాల్లో భూశాస్త్ర, విజ్ఞాన శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, పెట్రోలియం, ఇంధన శాఖ, సమాచార, ప్రసార శాఖల మంత్రిగా పనిచేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు తెచ్చుకున్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించేలా కృషిచేశారు.


కె.చంద్రశేఖర్‌రావు

పాలమూరు ఎంపీగా రాష్ట్ర సాధన : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌ నుంచి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత తెదేపా ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుత భారాస)ని స్థాపించారు. కరీంనగర్‌ ఎంపీగా రెండు సార్లు గెలిచి ఉత్తర తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని విస్తరించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. దక్షిణ తెలంగాణలో పార్టీని, ఉద్యమాన్ని విస్తరించేందుకు 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి 15వ లోక్‌సభకు పోటీచేసి ఎంపీగా గెలిచారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. 2014లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టించి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని