logo

అందని ద్రాక్షగా.. టీ ఫైబర్‌ సేవలు

గ్రామాలకు డిజిటల్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్‌ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్‌ సేవలు అందనిద్రాక్షగా మారాయి.

Published : 29 Apr 2024 05:01 IST

అచ్యుతాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన టీ ఫైబర్‌ పరికరం

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : గ్రామాలకు డిజిటల్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్‌ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్‌ సేవలు అందనిద్రాక్షగా మారాయి. పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసి నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోని ఐటీ శాఖకు కమాôడ్‌  కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి.

నత్తనడకన పనులు : పట్టణ ప్రాంతాల మాదిరిగా ప్రతి మారుమూల పంచాయతీల్లోనూ సాంకేతిక సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2017లో టీ ఫైబర్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, ఖర్చు, పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు, ఆదాయవ్యయాలు, ధ్రువీకరణ పత్రాల జారీ వంటివి డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలన్నదే పథకం ప్రధాన ఉద్దేశం. జిల్లాలో 14 మండలాల్లోని 255 గ్రామపంచాయతీల్లో టీ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా రహదారికి ఇరువైపులా రెండు వరుసల పైపులైన్లు వేశారు. వీటి పనులు గతంలోనే పూర్తయ్యాయి. టీ ఫైబర్‌ అనుసంధానం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలోని ఒక్క గ్రామపంచాయతీకి కూడా కనెక్షన్‌ ఇవ్వలేదు. ఇంటర్‌నెట్ కేబుళ్ల అనుసంధానం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో పంచాయతీలో సేవలు పొందలేక పోతున్నారు. ఐటీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటం వల్ల గ్రామీణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విధానం అమలైతే ఇంటింటికి అంతర్జాల సేవల సౌకర్యం సమకూరే అవకాశముంది. ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుళ్లను ఏర్పాటు చేసి పట్టించుకోకపోవడం లేదు. నిర్వహణ లేక పోవడంతో పరికరాలు తుప్పుపడుతున్నాయి.

పరికరాలు నిరుపయోగం

రెండేళ్ల కిందట గ్రామపంచాయతీ భవనంలో టీ ఫైబర్‌ పరికరాలను అమర్చారు. ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామపంచాయతీకి అంతర్జాలం సౌకర్యం కల్పిస్తే ఆన్‌లైన్‌ సేవలు వినియోగంలోకి వస్తాయి. అధికారులు స్పందించి అంతర్జాల వసతి కల్పించాలి.

శారద, మాజీ సర్పంచి అచ్యుతాపురం, వనపర్తి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

గ్రామాలకు సాంకేతిక సేవలు అందించాలన్న లక్ష్యంతో టీ ఫైబర్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గ్రామపంచాయతీల్లో సౌరపలకలు, యంత్రాలను ఏర్పాటు చేశారు. అంతర్జాల వసతి కల్పించలేదు. గ్రామాల్లోనూ సేవలందించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.

రమణమూర్తి, డీపీవో వనపర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని