logo

వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం

వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు.

Published : 29 Apr 2024 05:23 IST

పంటల విస్తీర్ణం పెరుగుతుందని అంచనా
ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు

వనపర్తిలోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ గోదాంలో సిద్ధంగా ఉన్న వరి విత్తనాలు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం: వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. సాధారణ వర్షాలు పడితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18.46 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తారు. ఈ ఏడాది కూడా ఇంచు మించు అంతే విస్తీర్ణంలో సాగు కానుందని అంచనా వేశారు. గతేడాది వర్షాలు అనుకూలించక 15.59 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. గతేడాది పత్తి సాగు పడిపోయింది. కంది, మొక్కజొన్న వంటి పంటలు రైతుల చేతికి అందలేదు. వరి మాత్రం సగటుకు మించి సాగైంది. ఈ ఏడాది కంది, పత్తి, జొన్న పంటల సాగు పెరగనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ నుంచి రైతులకు విత్తనాలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్క్‌ఫెడ్‌, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎరువులు అందించేలా చర్యలు చేపట్టారు.

క్షేత్రస్థాయి పరిస్థితి ఇది : ఏటా మాదిరే ఈ ఏడాది పచ్చిరొట్ట ఎరువులు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇంకా రాయితీ ధరలు నిర్ణయించలేదు. గతేడాది జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలను 5వేల క్వింటాళ్ల వరకు పంపిణీ చేసింది. ఒకటి, రెండు రోజుల్లో రాయితీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

  • ఉమ్మడి జిల్లాలో 9.18 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 ఎకరాల్లో కంది, 2.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసే వీలుంది. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వీటిని అందించటం లేదు. రైతులందరూ ప్రైవేటు వ్యాపారుల వద్దే కొనుగోలు చేయాల్సి వస్తోంది.
  • ఐదేళ్ల క్రితం రద్దు చేసిన రాయితీ విత్తనాల పంపిణీ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని చాలా మంది రైతులు ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
  • ఉమ్మడి జిల్లాలోని మార్క్‌ఫెడ్‌, ప్రైవేటు వ్యాపారుల వద్ద 2.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో కాంప్లెక్స్‌, డీఏపీ, పొటాష్‌, యూరియా వంటి ఎరువులు ఉన్నాయి. వీటిని ముందుగానే మండల కేంద్రాల్లోని గోదాములకు తరలించనున్నారు.

రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు : వచ్చే నెల మొదటి వారంలో రైతులకు 65 శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన రైతులు మండల కేంద్రాల్లోని ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయొచ్చు. కంది, పెసర తదితర విత్తనాలు ఇతర జిల్లాల నుంచి తెప్పించాలని ఆలోచిస్తున్నాం.

రాజీవ్‌, ఉమ్మడి జిల్లా డీఎం,  విత్తనాభివృద్ధి సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని