logo

రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం

సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు.  కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. 

Published : 19 May 2024 06:06 IST

మద్దూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం

న్యూస్‌టుడే, మద్దూరు: సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు.  కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. 

మద్దూరులో ఒకప్పుడు చిన్న భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నామమాత్రపు సిబ్బందితో ఉండేది. దీన్ని వైద్య విధాన పరిషత్తులోకి మారుస్తూ రూ.3.5 కోట్ల వ్యయంతో సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. 30 పడకల అసుపత్రిగా మార్చారు. 2022 జూన్‌16న అప్పటి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తున్నా సిబ్బందిని నియమించలేదు. మద్దూరు, కొత్తపల్లి మండలాల పరిధిలో 50కి పైగా గ్రామల ప్రజలు వైద్యానికి మద్దూరుకు వస్తుంటారు. గతంలో 100 లోపు రోగులు వచ్చే ఈ అసుపత్రికి ప్రస్తుతం ప్రతి రోజూ 300 వరకు రోగులు వస్తున్నారు. కొత్త భవనం, అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా సరిపడా వైద్యులు, సిబ్బంది లేక రోగులకు అవస్థలు తప్పటం లేదు. ప్రధానంగా  మహిళలకు వైద్య సేవలు అందించే నిపుణులు(గైౖనకాలజిస్ట్‌) లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు.గర్భిణులకు వైద్యం, సూచనలు అందటం లేదు. పురిటి నొప్పుల సమయంతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగురు డాక్టర్లు ఉండాలి. కానీ ఓ వైద్యురాలు మాత్రమే ఉన్నారు. రాత్రి వేళల్లో వచ్చే రోగులకు వైద్యం అందించే వారు లేక నర్సలు వైద్యం చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతే నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు తరలిస్తున్నారు. 

కోస్గిలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల సామాజిక అసుపత్రిలో సిబ్బంది లేక రోగులకు సరైన వైద్యం అందటం లేదు. రెండేళ్ల కిందట నిర్మించిన ఈ అసుపత్రిలో అరకొర సేవలే అందుతున్నాయి.

మక్తల్‌లో 150 పడకల కొత్త ఆసుపత్రి భవన నిర్మాణానికి 2023 నవంబరులో శంకుస్థాపన చేశారు. నేటికీ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. 80 ఏళ్ల కిందట నిర్మించిన భవనంలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని