logo

భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్‌రావు

భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్‌ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Updated : 23 Apr 2024 06:16 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో సునీతారెడ్డి, యాదవ రెడ్డి

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్‌ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్‌లో నియోజకవర్గ ముఖ్యనేతలతో మండలాల వారీగా సమావేశమైన సందర్భంగా ఆయన సోమవారం రాత్రి మాట్లాడారు. వెంకట్రామిరెడ్డి జీవితం తెరచిన పుస్తకం అని, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు దశాబ్దాల పాటు ఉత్తమ సేవలందించారని అన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన హయాంలో భూసేకరణ జరిగితే అదేదో ఆయన సొంతానికి చేసుకున్నట్లు భాజపా తప్పుడు ప్రచారం సాగిస్తుందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణం వెంకట్రామిరెడ్డి హయాంలో జరిగిందని తెలిపారు. ఈ కాలనీలో గత ఎన్నికల్లో భారాసకు అత్యధిక మెజారిటీ వచ్చిందని తెలిపారు. సిద్దిపేటలో ఉద్యోగులపై ఆయన ఫిర్యాదు చేయడంతో వారంతా వ్యతిరేకమయ్యారని, ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడంతో రైతులంతా ఎదురు తిరుగుతున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్‌ నిర్మాణం జరగకుంటే లక్షల ఎకరాలు సాగుకు నోచుకునేది కాదని.. మండుటెండల్లో మత్తడులు దూకడం వెంకట్రామిరెడ్డి పుణ్యమేనన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏం చేసిందని రఘునందన్‌ రావుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానిది తెలంగాణ పట్ల మొదటి నుంచి సవతి తల్లి ప్రేమేనని అన్నారు. రఘునందన్‌ రావు ఓటమి ఖాయమని తెలిసి, తమ అభ్యర్థిపై తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని.. ఈ విషయమై ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్‌ రెడ్డి, గోపి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులు మన్సూర్‌, పురపాలిక అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులు నయీమోద్దీన్‌, సీనియర్‌ నాయకులు సత్యం గౌడ్‌, సంతోష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని