logo

అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Updated : 30 Apr 2024 06:44 IST

జహీరాబాద్‌ బరిలో 19 మంది..

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు: జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 40 మంది 68 సెట్లు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియలో 14 మందికి చెందిన 19 సెట్లు తిరస్కరించారు. 26 మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. బరిలో ఉన్న వారిలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆరుగురు, మిగతా పది మంది స్వతంత్రులు. అభ్యర్థుల సంఖ్య 15 దాటడంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఈవీఎంలో నోటాతో కలిపి 16 గుర్తులు ఉంటాయి. ఓటర్లు రెండు ఈవీఎంలను పరిశీలించి.. నచ్చిన అభ్యర్థికి చెందిన మీట నొక్కనున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థుల నేపథ్యం

గాలి అనిల్‌కుమార్‌: భారాస

2009లో భారాస (తెరాస) పటాన్‌చెరు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 2014లోటికెట్‌ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్‌లో చేరి.. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ టికెట్‌ రాకపోవడంతో తిరిగి భారాస గూటికి చేరారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.


బీబీ పాటిల్‌: భాజపా

స్వగ్రామం కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం సిర్పూర్‌. జహీరాబాద్‌ నుంచి రెండు పర్యాయాలు (2014, 2019లో) భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపిగా గెలుపొందారు. ఇటీవల భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ¨లో ఉన్నారు.


సురేష్‌ కుమార్‌ షెట్కార్‌: కాంగ్రెస్‌

2004లో ఖేడ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మొదటి ఎంపీగా విజయం సాధించారు. 2014లో జహీరాబాద్‌ ఎంపీగా, 2018లో నారాయణఖేడ్‌ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


మెదక్‌ పోరులో 44 మంది..

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు తలపడుతున్న నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే మెదక్‌ ద్వితీయ స్థానంలో ఉంది. ఇందులో గుర్తింపు, రిజిస్టర్‌ పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 29 మంది స్వతంత్రులు బరిలో నిలిచాయి. అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్‌ రోజున ఓటు వేసేందుకు మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరమరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని