logo

ఇటు రచన.. అటు బోధన

పాఠ్యపుస్తకాల రచనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ 2019లో నిర్వహించిన బాలసాహిత్య కార్యశాలల్లో పాల్గొని ‘తెలుగు మహిళలు- స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకాన్ని రాశాను.

Published : 05 Oct 2022 05:59 IST

పాఠ్య పుస్తకాల రూపకల్పనలో జిల్లా ఉపాధ్యాయినులు

- చిట్యాల, న్యూస్‌టుడే

ఓ పక్క తరగతి గదిలో పాఠాలు చెప్తూ... మరోపక్క  పాఠ్యాంశాల రూపకల్పనలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాళ్లు భాగస్వాములవుతున్నారు. గదుల్లో పిల్లల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి, ఆ కోణంలో ఆలోచిస్తూ అందుగు తగ్గట్టుగా వారు కూడా నిత్యవిద్యార్థులై విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయురాళ్ల మనోభావాలివి....


పుస్తక రచనలో పాల్గొనడం ఆనందంగా ఉంది
- ఉప్పల పద్మ, జడ్పీ బాలిక ఉన్నతపాఠశాల, మిర్యాలగూడ

పాఠ్యపుస్తకాల రచనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ 2019లో నిర్వహించిన బాలసాహిత్య కార్యశాలల్లో పాల్గొని ‘తెలుగు మహిళలు- స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకాన్ని రాశాను. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో రూపొందించనున్న ‘సరళ తెలుగువాచకం’ రచయిత బృందంలో పొడుపు కథల రూపకల్పన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్య పరిచేందుకు యునిసెఫ్‌ వారి అభ్యర్థన మేరకు ‘చిన్నవయసులో పెళ్లిల్లు వద్దు’, ‘పిల్లలు ఉండాల్సింది బడిలోనే’ అనే రెండు నాటికలు రాశాను. ఉపాధ్యాయురాలిగా విద్యార్థులు ఆసక్తి కనబరిచే అంశాలపై అవగాహన ఉండటంతో పాఠ్యాంశాల రచన నాకు సులభతరమయ్యింది.


రచయితగా అవకాశం గొప్ప అనుభూతి
వురిమళ్ల సునంద (సూర్యాపేట వాసి, ప్రస్తుతం ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం, కలకోట జడ్పీహెచ్‌ఎస్‌)

2007లో రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహిత్య రూపకల్పనలో ఖమ్మం జిల్లాలోని ఎడిటోరియల్‌ బోర్డులో పనిచేశాను. 2014లో 1-5 తరగతులకు పాఠ్యపుస్తక రచనలో పాల్గొన్నాను. వర్ణమాలు నేర్పించడం కోసం నేను రాసిన గేయాలు ఎంపిక కావడం, కథలు సరళంగా చేసి రాయడం ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు వాచకంలో రచయిత్రిగా నాపేరు చూసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. దూరవిద్య విద్యార్థులకు పుస్తక రచనలో, క్యూఆర్‌ కోడ్‌ పాఠాల రూపకల్పనలోనూ భాగస్వామిని అయ్యాను. రిసోర్స్‌ పర్సన్‌గా ఎన్నో మాడ్యూల్స్‌ చదవడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటివి పాఠ్య పుస్తక రూపకల్పనలో నాకు ఉపయోగపడ్డాయి.


ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి...
- డా.బండారు సుజాత, జడ్పీహెచ్‌ఎస్‌ గుజ్జ, యాదాద్రి భువనగిరి జిల్లా

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగు పుస్తక రచనలో పాల్గొన్నాను. 2009-17లో ఓపెన్‌ స్కూల్‌ బ్రిడ్జి కోర్సులు, హేండ్‌ బుక్స్‌, మాడ్యూల్స్‌, కథలు రచనలో భాగస్వామినయ్యాను. 2012-14లో 1-5, 2015లో 1-3 తరగతుల తెలుగు పుస్తకాల రూపకల్పనలో పాల్గొన్నాను. 2010-22లో 3,5,7,8 తరగతుల దూర విద్య విద్యార్థులకు తెలుగు అధ్యయన సామగ్రి తయారీలో పాల్గొన్నాను. విద్యార్థుల కోసం రూపుదిద్దుకునే ఈ క్రతువులో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని