logo

ప్రసవాలకు వసతులు మెరుగు

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు, సాధారణ కాన్పులు అధికంగా జరిగేలా ప్రోత్సహిస్తున్న మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘లక్ష్య’ (లేబర్‌ రూమ్‌ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ఇనిషియేటివ్‌) పథకం కింద ఎంపిక చేసింది.

Published : 07 Jun 2023 03:09 IST

‘లక్ష్య‘ పథకం కింద మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి ఎంపిక

మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు, సాధారణ కాన్పులు అధికంగా జరిగేలా ప్రోత్సహిస్తున్న మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘లక్ష్య’ (లేబర్‌ రూమ్‌ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ఇనిషియేటివ్‌) పథకం కింద ఎంపిక చేసింది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ఆసుపత్రులను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి మాత్రమే ఉంది. మిగతావి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించాయి. నలుగురు సభ్యుల బృందం ప్రత్యేకంగా మిర్యాలగూడ ఆసుపత్రిని సందర్శించింది. వసతులు, రోగులకు ప్రత్యేకించి గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు బృందం సభ్యులు పరిశీలించారు. గతంలో సాధారణ కాన్పులు, సిజేరియన్ల వివరాలు సేకరించి మార్కులు వేశారు. వీటి ఆధారంగా మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి ‘లక్ష్య’ పథకం కింద ఎంపికైంది.

మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రస్తుతం వంద పడకలు ఉండగా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కృషితో మరో వంద పడకలుగా విస్తరిస్తున్నారు. దీనికి రూ.14 కోట్లు వెచ్చిస్తున్నారు. మూడేళ్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస సమరధ్‌ వైద్యులు, సిబ్బందిని సమన్వయం చేసి ప్రసవాల సంఖ్య పెంచారు. నిత్యం ఆసుపత్రికి 500 మందికి పైగా బయటి రోగులు (ఓపీ) వస్తున్నారు. 150 మంది వరకు రోగులు (ఐపీ) ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 24 గంటల పాటు వైద్యం విషయంలో వైద్యులు క్రమశిక్షణతో పనిచేస్తుండగా ప్రసవాల సంఖ్యతో పాటు సాధారణ వైద్య చికిత్సలు, కంటి ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు మెరుగుపడ్డాయి. అత్యవసర సమయంలో వైద్యసేవలు మెరుగ్గా అందిస్తుండగా అన్నింటిని పరిశీలించి కేంద్ర బృందం మిర్యాలగూడ ఆసుపత్రిని ఎంపిక చేసింది.

ప్రయోజనాలు ఇవీ..

లక్ష్య పథకాన్ని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 2017లో ప్రారంభించింది. అత్యధికంగా ప్రసవాలు జరిగే ఆసుపత్రులు, మెరుగైన వైద్యసేవలు అందించే ఆసుపత్రులను గుర్తించి వాటిలో ప్రసవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేయనున్నారు. ఈ నిధులతో మెరుగైన ప్రసవం గదులు, సిజేరియన్‌ చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌, గర్భిణులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రసవించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రసవం తరువాత శిశువు, తల్లికి మంచి వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రసవానికి వచ్చే గర్భిణులు ప్రశాంతంగా ఉండేలా వసతులు కల్పించటంతో పాటు స్వాంతన చెందేలా వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిశువు పుట్టిన గంటలోపు తల్లి పాలు తాగించేలా ప్రత్యేక పర్యవేక్షణ పెంచనున్నారు.


‘లక్ష్యా’నికి అనుగుణంగా వైద్యసేవలు మెరుగు

డాక్టర్‌ శ్రీనివాస సమరధ్‌, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

కేంద్ర బృందం పరిశీలన సమయంలో ఆసుపత్రిలో వైద్యసేవల వివరాలు సేకరించారు. ఇక్కడికి వచ్చే గర్భిణుల సంఖ్యకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలు కల్పిస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తామని వైద్యులుగా హామీ ఇచ్చాం. దీంతో లక్ష్య పథకం కింద ఎంపిక చేశారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు ఆసుపత్రుల్లో మా ఆసుపత్రి ఉండటం మాకు సంతోషంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని