logo

Teacher: కన్నీటి వీడ్కోలుతో.. సారూ..సారూ.. అంటూ వెక్కివెక్కి ఏడ్చారు!

సారూ..సారూ.. అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. తమను రోజూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించే సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన నకిరేకల్‌లో మంగళవారం చోటు చేసుకుంది.

Updated : 20 Dec 2023 08:44 IST

రోదిస్తున్న విద్యార్థులు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: సారూ..సారూ.. అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. తమను రోజూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించే సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన నకిరేకల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌ పుర కార్యాలయం వద్ద ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బచ్చుపల్లి శ్రీనివాసరావు(50) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. అంత్యక్రియలు మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఆ ఉపాధ్యాయుడంటే విద్యార్థులకు చాలా అభిమానం. కోపగించుకోకుండా పిల్లలను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ పాఠాలు బోధించేవారు. భోజనం చేసి వచ్చారా..  తినే పాఠశాలకు రావాలని చెప్పేవారని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన బీరువాలో చాక్లెట్ల పొట్లాలు ఎప్పుడూ ఉండేవని, పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్లకు ఇచ్చి బుజ్జగించేవారని పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ గుర్తుచేసుకున్నారు. రోదిస్తున్న చిన్నారులను ఎమ్మెల్యే సతీమణి వేముల పుష్ప ఓదార్చారు.  శ్రీనివాసరావు మృతదేహం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీపీసీసీ పూర్వ కార్యదర్శి దైద రవీందర్‌, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్‌ తదితరులు నివాళి అర్పించారు. అంత్యక్రియలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.

బచ్చుపల్లి శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని