logo

ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్‌

పోలింగ్‌ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు. 

Published : 23 Apr 2024 02:29 IST

కోదాడలోని ఆర్డీవో కార్యాలయంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌హెగ్డే

కోదాడ న్యూస్‌టుడే: పోలింగ్‌ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోలింగ్‌ సజావుగా జరిగేందుకు సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ముగ్గురు విలేజ్‌ పోలీసు వాలంటీర్స్‌ ఈసీఐ సింబల్‌తో జాకెట్‌ వేసుకొని ఉండాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల నంబర్లు రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ ఈవీఎంలు తరలించేటపుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత పెంచాలన్నారు. ఎస్‌ఎస్‌టీ బృందాలు నిత్యం పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా ఎక్సైజ్‌ అధికారి లక్ష్మానాయక్‌, పుర కమిషనర్‌ రమాదేవి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐలు రజితరెడ్డి, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకుంటే చర్యలే

కోదాడ, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ వెంకటరావు మిల్లుల యజమానులను హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని పలు మిల్లులను సందర్శించి సీఎంఆర్‌ బియ్యం నిల్వలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచే ధాన్యం లోడులను వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. లారీల కొరత ఏర్పడితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు ఆగుతాయన్నారు. దీంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ సాయగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.


నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర

చివ్వెంల, న్యూస్‌టుడే: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు సూచించారు. మండలంలోని వల్లభాపురంలో పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 89,598.280 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నామని, రూ.60 కోట్లకు పైగా చెల్లింపులు జరిపామన్నారు. జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నందున అన్ని కేంద్రాల్లో టార్పాలిన్లతో పాటు ధాన్యాన్ని శుద్ధి చేసే యంత్రాలు, గోనె సంచులు, కాంటాలు, తేమ శాతం చూసే యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్వో మోహన్‌బాబు, తహసీల్దార్లు కృష్ణయ్య ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని