logo

గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్‌

త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సెక్టార్‌, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ వెంకటరావు అన్నారు.

Published : 24 Apr 2024 02:25 IST

తుంగతుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న

కలెక్టర్‌ వెంకటరావు, చిత్రంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత, తదితరులు

తుంగతుర్తి, న్యూస్‌టుడే: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సెక్టార్‌, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ వెంకటరావు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలోని శ్రీ వెంకటలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో విలేజ్‌ పోలీసు వాలంటీర్లను ప్రతి కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ జరిగేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ బృందాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు రూ.5.50 కోట్లు సీజ్‌ చేసినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు గట్టి బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్వో, అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత, డీఎస్పీ రవి, తహసీల్దార్లు రమణారెడ్డి, శ్రీను, అమిన్‌నాయక్‌ పాల్గొన్నారు.

కౌలు రైతులకు ఇబ్బందులు కల్గించవద్దు..

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేందుకు కౌలురైతులకు ఇబ్బందులు కల్గించవద్దని కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు. మంగళవారం తుంగతుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తాము భూములు కౌలుకు తీసుకున్న భూపట్టాదారులు అందుబాటులో లేకపోవడంతో వారు ఐరిస్‌, ఓటీపీలు వేయడానికి రాలేకపోతున్నారని, తమ పరిస్థితి ఏమిటని కలెక్టర్‌ను కౌలురైతు తడకమల్ల వెంకన్న అడిగారు. స్పందించిన కలెక్టర్‌ ఆ కౌలు రైతు పేరిట బిల్లు చేసి వారి ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత, తహసీల్దారు రమణారెడ్డి, ఏపీఎం నర్సయ్య పాల్గొన్నారు.

సూర్యాపేట కలెక్టరేట్‌: ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్‌ వెంకటరావు సూచించారు. కలెక్టరేట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నోడల్‌, ప్రత్యేక అధికారులు, ఏఆర్‌వోలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రియాంకతో కలిసి మాట్లాడారు. రాజకీయ నాయకుల ప్రతినిధులతో ఈ నెల 24న ఇంటి వద్ద ఓటింగ్‌పై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్‌వో సతీష్‌, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో మధుసూదన రాజు, ఎఫ్‌డీవో రూపేందర్‌ సింగ్‌, డీఎస్‌వో పద్మ, ఆర్డీవోలు వేణుమాధవ్‌, సూర్యనారాయణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఓటు ఆవశ్యకతపై పోటీలు

సూర్యాపేట కలెక్టరేట్‌: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం  ఓటు ఆవశ్యకతపై నిర్వహించిన డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలను కలెక్టర్‌ వెంకటరావు పరిశీలించి మాట్లాడారు. నోడల్‌ అధికారి, డీఈవో అశోక్‌, డీఐఈవో కృష్ణయ్య, కోఆర్డినేటర్‌ జనార్దన్‌, బాల భవన్‌ పర్యవేక్షకులు రాధారెడ్డి పాల్గొన్నారు.

అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు

సూర్యాపేట కలెక్టరేట్‌: జిల్లాలోని చెరువుల్లోంచి అక్రమంగా మట్టిని తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ వెంకటరావు మంగళవారం హెచ్చరించారు. రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని