logo

నిబంధనలకు నీళ్లు..!

కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే.

Published : 29 Apr 2024 04:35 IST

కోదాడలో వాటర్‌ సరఫరా చేస్తున్న ఆటో

కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. బీఐఎస్‌, ఫుడ్‌ అధికారుల అనుమతులు ఒక్క దానికి కూడా లేవు. కొన్ని వాటర్‌ ప్లాంట్లపై గతంలో కొందరు పురపాలికకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 800కు పైగా వాటర్‌ ప్లాంట్లు ఉండగా, వాటిలో పది శాతం కూడా అనుమతి పొందినవి లేవని ఓ అధికారి తెలిపారు.

కోదాడ, మిర్యాలగూడ, హాలియా, న్యూస్‌టుడే: వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు ఇంటింటికీ తిరిగి క్యాన్ల ద్వారా నీళ్లు ఇవ్వడంతో స్థానికులు కొనుగోలు చేసి వాటినే తాగుతున్నారు. ప్లాంట్ల నిర్వాహకులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ పేరిట విచ్చలవిడిగా నీళ్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా మంది నిర్వాహకులు ఇంట్లో బోరు వేసి ఎలాంటి పరీక్షలు చేయకుండా ఆ నీటినే ప్యూరిఫైడ్‌ చేసి విక్రయిస్తున్నారు.

అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం..

కొందరు ప్లాంట్ల నిర్వాహకులు నీళ్లు రుచిగా ఉండాలని అధికంగా ప్యూరిఫైడ్‌ చేస్తున్నట్లు సమాచారం. చాలా చోట్ల మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో ఈ నీటినే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. నిబంధనలకు విరుద్ధంగా తయారైన ఆ నీరే నిత్యం తాగుతుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీటి శుద్ధి కేంద్రాలపై తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.

ఈ అనుమతులు ఎక్కడ?

ప్లాంట్లకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ధ్రువపత్రం, ట్రేడ్‌, ఫుడ్‌ లైసెన్స్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఎన్‌వోసీ ఆధారంగా విద్యుత్‌ శాఖ నుంచి కనెక్షన్‌ ఉండాలి. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌, భారత ప్రమాణాల ప్రకారం బయాలజిస్టు, కెమిస్టుల అనుమతి ఉండాలి. నీటి నాణ్యతను పరీక్షించే పరికరాలు ఉండాలి. వాటర్‌ ప్లాంట్లలో ఇనుప వస్తువులు కాకుండా స్టీల్‌ డ్రమ్ములు ఉపయోగించాలి. ఈ నిబంధనలు ప్లాంట్ల నిర్వాహకులు పాటించట్లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేయకపోవడంతో వాటర్‌ ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. క్షేత్రస్థాయిలో నిఘా పెంచి, నాణ్యమైన శుద్ధజలం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

క్షేత్ర స్థాయిలో పరిశీలించి సీజ్‌ చేస్తాం: యాదగిరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోదాడ

ప్లాంట్ల నిర్వాహకులు పురపాలిక అనుమతి తీసుకోవాలని ఎన్నో సార్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా ప్యూరిఫైడ్‌ చేస్తున్న ప్లాంట్లను సీజ్‌ చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని