logo

ఇదేం బాగోతం!

కావలి పట్టణం జనతాపేటకు చెందిన ఓ వ్యక్తికి వైఎస్‌ఆర్‌ కాపునేస్తం ఇచ్చినట్లు కరపత్ర పుస్తకంలో చూపించారు. తాను ఆ సామాజిక వర్గం కాకున్నా.. తన పేరు అందులో ఉందని ఆ వ్యక్తి నివ్వెరపోతున్నారు.

Published : 29 Aug 2023 04:38 IST

గోరంత ఇచ్చి.. కొండంత ప్రచారం
గడపగడపలో  నిరసన స్వరాలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటా అందజేస్తున్న కరపత్రం

కావలి పట్టణం జనతాపేటకు చెందిన ఓ వ్యక్తికి వైఎస్‌ఆర్‌ కాపునేస్తం ఇచ్చినట్లు కరపత్ర పుస్తకంలో చూపించారు. తాను ఆ సామాజిక వర్గం కాకున్నా.. తన పేరు అందులో ఉందని ఆ వ్యక్తి నివ్వెరపోతున్నారు.

కావలి పురపాలక పరిధిలోని 29వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. తాను అలా ఎప్పుడూ అనారోగ్యంతో చికిత్స పొందలేదని చెప్పుకొస్తున్నారు.

కావలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జరిగిన లబ్ధి కంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల వద్దకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు ప్రస్తుత వైకాపా పాలనలో చేసిన మేలు గురించి వివరిస్తూ 16 పుటల కరపత్ర పుస్తకాన్ని అందజేస్తున్నారు. ఆ పుస్తకం ముందుభాగంలో ఉండే అట్టపై సదరు కుటుంబం పొందిన మొత్తం లబ్ధి గురించి రూపాయలతో సహా వివరించేలా ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కావలి పురపాలక సంఘం పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంపై అసలు కంటే ప్రచారం జాస్తి అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బిడ్డలే లేని వారికి సైతం జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెనలు ఇచ్చినట్లు చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు నిర్మించుకోకపోయినప్పటికీ ఆ కరపత్ర పుస్తకంలో లబ్ధిదారుల వివరాలుంటున్నాయి.


అవాస్తవ గణాంకాలు.. : కావలి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆలస్యంగా జరుగుతోంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ల నాలుగు నెలలవుతుండగా, ఇప్పుడు కేవలం మూడో ఏటా సంక్షేమ బావుటా అంటూ పుస్తకాలను అందజేస్తున్నారు. ఇక నాలుగో సంవత్సరం వివరాలను కూడా కలిపితే ఇంకా అవాస్తవ గణాంకాలు వెలుగు చూసే అవకాశం ఉంది. తమ బ్యాంక్‌ ఖాతాలు పరిశీలిస్తే.. ప్రభుత్వం సాయం చేసింది? లేనిది? బహిర్గతమవుతుందని పలువురు తేల్చిచెబుతున్నారు. మహిళల పేరిట ఇచ్చిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తాలు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తుండటంపై పలువురి కుటుంబాల్లో కలహాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.


తప్పుడు ప్రచారం తగదు

మేము అద్దె ఇంటిలో ఉంటున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. ఎమ్మెల్యే వచ్చి రూ.6లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చినట్లుగా, రూ.2.5లక్షల వరకు గృహ నిర్మాణ సంస్థ నిధి అందినట్లు ఓ కరపత్ర పుస్తకాన్ని ఇచ్చి వెళ్లారు. ఇవ్వకుండానే ఇలా ప్రచారం చేసుకోవడం ఏమీ బాగోలేదు. పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి.

షేక్‌ సుల్తానా, 18వ వార్డు, కావలి


నాకు అంత రాలేదు

నాకు ప్రభుత్వం నుంచి వచ్చిన దానికంటే చాలా ఎక్కువగా పొందినట్లు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద రూ. 4,113, జగనన్న అమ్మఒడి పథకంలో రెండేళ్లకు రూ.29వేల వరకు అందడం వాస్తవమే. వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 33,590 అందజేసినట్లు చూపిస్తున్నారు. ఆ మొత్తం నాకు దక్కలేదు. (స్వయంగా ఎమ్మెల్యేనే ఇంటి వద్దకు వచ్చి పుస్తకం ఇచ్చి వెళ్లడంతో ఆ రూ.33,590 ఏమి చేశావంటూ నా భర్త ప్రశ్నిస్తున్నారు.)

వైరంగం వీరమ్మ పొదుపు మహిళ, తుపాన్‌నగర్‌, కావలి


అవి ముద్రణ తప్పిదాలు

ఈగ కిరణ్‌, కమిషనర్‌, కావలి పురపాలక సంఘం: ఈ ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరిపించాం. అవన్నీ కంప్యూటర్‌ ద్వారా ముద్రణ జరుగుతోంది. ముద్రణ తప్పిదాలుగా సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. తేడాలు లేకుండా వాస్తవంగా ఎంత లబ్ధిపొందారో అంతమాత్రమే ముద్రించాలని సూచించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని