logo

జగన్‌ హామీ.. నెరవేరదేమీ?

అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Updated : 23 Apr 2024 06:21 IST

జిల్లాలో పర్యాటక ఆశలు ఆవిరి

అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ వీధుల్లో ప్రయాణం దుర్భరంగా మారింది.

ఇది సోమశిల జలాశయం వద్ద పర్యాటక శాఖ నిర్మించిన అతిథిగృహం. దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమశిల వద్ద పర్యాటక అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేయించారు. పనులు చేపట్టి పూర్తిచేశారు. అనంతరం పర్యాటక శాఖ పట్టించుకోలేదు. ప్రభుత్వం ఈ భవనాలు వినియోగంలోకి తేవాలనే ప్రయత్నమే చేయలేదు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఏఎస్‌పేట దర్గా, సోమశిల జలాశయం, పెంచలకోన మూడు భిన్న ప్రాంతాలు. వాటిని త్రికోణ పర్యాటక కేంద్రాలుగా చేస్తామని గత ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అనంతరం పట్టించుకోనేలేదు.

  •  హిందూముస్లిం భక్తులు అధికంగా సందర్శించే ఏఎస్‌పేట దర్గా పరిసర ప్రాంతాలను వీధులను వెడల్పు పేరుతో ఛిద్రం చేశారు. విస్తరణ పేరుతో ప్రధాన రహదారులకు ఇరువైపుల ఉన్న గొట్టాలను సగం మేరకు పగులగొట్టారు. ఇరువైపులా మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించాలి. పనులు దక్కించుకొన్న గుత్తేదారు బిల్లులు రావని వాటిని పట్టించుకోలేదు. ఫలితంగా ఇక్కడ వీధులు అధ్వానంగా మారాయి. మురుగునీటి నిల్వతో పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో భక్తులు, సందర్శకులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • సోమశిలలో పర్యాటక కేంద్రం అభివృద్ధి పనుల్లో భాగంగా బోట్‌ షికారు, యూ పాయింట్‌ వద్ద అతిథిగృహాలు. ప్రాజెక్ట్‌ ముందుభాగంలో పైలాన్‌, కలువాయి రోడ్డు మధ్యలో ఉద్యానవనం అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికి రూ. 2 కోట్లతో అతిథిగృహం, ఇతర నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిని వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో ఇవి ఉపయోగంలోకి రాకుండానే శిథిలమవుతున్నాయి. మిగిలిన పనుల ఊసు లేదు. పెంచలకోనలో పర్యాటక పనుల జాడే లేదు. ఇలా ఎన్నికల అనంతరం పర్యాటక అభివృద్ధి పనుల మాటను ప్రభుత్వం మరిచిపోయింది.

    హామీ: ఏఎస్‌పేట దర్గా, సోమశిల, పెంచలకోనలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం.

- 2019 ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌

అమలు: వైకాపా అధికారంలోకి వచ్చాక పైవేవీ అమలుకు నోచుకోలేదు. గతంలో సోమశిల వద్ద చేపట్టిన పనులు ఉపయోగంలోకి తేలేదు. మిగిలిన పనులు మరిచారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి అంశాన్నే అటకెక్కించారు.

ప్రధాన వీధుల్లో నడవలేం
సయ్యద్‌ అక్బర్‌, ఎ.ఎస్‌.పేట

ప్రధాన వీధుల పక్కన దుకాణాలను పగలగొట్టారు. అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో ప్రధాన వీధుల్లో రాకపోకలే సాగించలేని పరిస్థితి. దీంతో స్థానికులు, భక్తులకు అసౌకర్యంగా ఉంది.

పరిసరాలు అధ్వానం
మహబూబ్‌బాషా, ఎ.ఎస్‌.పేట

ఏఎస్‌పేటలో రోడ్ల విస్తరణ అంటూ దుకాణాలు పగులగొట్టారు. ఆపై మురుగు కాలువలు నిర్మించలేదు. దీంతో పరిసరాలు దారుణంగా మారాయి. మురుగు వీధుల్లో చేరి దుర్వాసన వస్తోంది. పర్యాటకులు ఉండలేని విధంగా పరిస్థితులు మార్చారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని