logo

మండుటెండలో ‘ఎన్నికల వేడి’

వాతావరణ మార్పుల కారణంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.

Published : 28 Apr 2024 02:42 IST

ముందస్తు చర్యలతోనే పోలింగ్‌ శాతం మెరుగు

ఎండతో నిర్మానుష్యంగా ప్రభుత్వ వైద్యశాల ఎదుట ట్రంకురోడ్డు ప్రాంతం

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: వాతావరణ మార్పుల కారణంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మేలో వడగాలులు కూడా వీయొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ రోజున ఎండ తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లకు ఇప్పటి నుంచే యంత్రాంగం సన్నద్ధం కావాలని వివిధ పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉంది.

గతంలో..

  • 2019లో దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలో ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరిగింది. గతంలో మాదిరిగా మొదటి విడతలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుతం  నాలుగో విడతలో భాగంగా మే 13న జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.
  • గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సరాసరిన 77.48 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలో ఓటింగ్‌ శాతంలో తొమ్మిదో స్థానంలో ఉంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటుంది. ఈసారి ఓటింగ్‌ శాతం పెరగాలని, ఆ దిశగా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేయాలని ఓటర్లు కోరుతున్నారు.

ఏర్పాట్లు చేస్తేనే..

ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు రాకుండా, వడదెబ్బ తగలకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సన్నద్ధం కావాల్సి ఉంది. అధికశాతం కేంద్రాలు పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు. ఆయా చోట్ల నీడ, తాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు. వడదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో తగిన వైద్య సదుపాయాలు సమకూర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటర్లు ఎక్కువ సేపు వేచి చూడకుండా వీలైనంత త్వరగా పోలింగ్‌ జరిగేలా అధికారులు చూడాలని చెబుతున్నారు. అలాగే ఎండలకు భయపడి చాలామంది ఓటుకు దూరంగా ఉంటారు. అలాంటి వారికి రవాణా వసతి కల్పించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని