logo

అవరోధాలు దాటితేనే ప్రగతి

నిజామాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే అంశంపై ఇటీవల సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు తాజాగా చర్చించారు.

Published : 30 Nov 2022 06:36 IST

అసంపూర్తి దశల్లో పనులు
పురపాలికల్లో ఇదీ పరిస్థితి
ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ నగరం

బోధన్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో అసంపూర్తిగా మురుగుకాల్వ

నిజామాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే అంశంపై ఇటీవల సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు తాజాగా చర్చించారు. దీంతో పట్టణాల్లో ప్రగతిపై ఒక్కసారిగా కదలిక వచ్చింది. అయితే ఇప్పటికే ప్రారంభించి.. అసంపూర్తి దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు.  

నిజామాబాద్‌ నగరం : ఇందూరు పట్టణంలో జనాభా నాలుగు లక్షలకు చేరింది. అంత్యక్రియల నిర్వహణకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అర్సపల్లి, దుబ్బ, వర్ని రోడ్డులో రూ.3.30 కోట్లతో వైకుంఠధామాలు నిర్మించాలని గతేడాది నిర్ణయించారు. వర్నిరోడ్డులో ఆరు నెలల కిందటే పనులు నిలిచిపోగా.. తాజాగా సోమవారం ప్రారంభించారు. రఘునాథ చెరువుకు అనుబంధంగా రూపుదిద్దుకుంటున్న మినీ ట్యాంకుబండ్‌ పనులు ప్రారంభమై రెండేళ్లు దాటింది. వ్యయం పెరుగుతూ వచ్చి రూ.20 కోట్లకు చేరింది. టైల్స్‌ వేయటం, ట్రాక్‌ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. వినాయక్‌నగర్‌లో రూ.1.20 కోట్లు, మారుతీనగర్‌లో రూ.1.50 కోట్లతో ఉద్యానాలు నిర్మిస్తున్నారు. రెండేళ్ల కిందట పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా కాలంలో నిలిచిపోయాయి. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. రూ.6 కోట్లతో నగరపాలక సంస్థ కార్యాలయం కోసం నిర్మించిన నూతన భవనం అసంపూర్తి దశలోనే ఉంది. మరికొన్ని నిధులు వెచ్చిస్తే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆర్మూర్‌ పట్టణం :  పట్టణవాసులకు సౌకర్యంగా కూరగాయలు, మాంసం విక్రయాలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత మార్కెట్‌ నిర్మించాలని నిర్ణయించారు. కొంతకాలం కిందట అంగడిబజార్‌లో శంకుస్థాపన చేశారు. రైతులు వ్యతిరేకించటంతో అక్కడితో ఆపేశారు. పిప్రి రోడ్డు, పెర్కిట్‌లో రెండు వైకుంఠధామాలు నిర్మిస్తున్నా.. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వార్డుల్లో మురుగుకాల్వలు, కల్వర్టులను పూర్తి చేయాల్సి ఉంది.

భీమ్‌గల్‌ పట్టణం : మార్కెట్‌ సౌకర్యం లేక రోడ్ల మీదే కూరగాయలు, పూలు విక్రయిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. సమస్య పరిష్కారానికి సమీకృత మార్కెట్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు భూమిని కేటాయించడంతో చదును చేసే పనులు సాగుతున్నాయి. మరోవైపు పార్కు కోసం నిధులు కేటాయించారు.

బోధన్‌ పట్టణం :  టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో ఫుట్‌పాత్‌, మురుగుకాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. చివరి దశకు వచ్చిన తర్వాత ఓ చోట అర్ధాంతరంగా నిలిచిపోయింది. రెండో విడతలో వచ్చిన రూ.25 కోట్లలో రూ.13.71 కోట్ల విలువైన పనులు ఏడాదిన్నరగా ఆగాయి. అయితే ఈ నిధులకు తాజాగా సవరణ ప్రతిపాదనలు నివేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని