logo

నిఘా నీడలో.. సాంకేతిక తోవలో..

పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షల్లో నియామక మండలి పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఎలాంటి తప్పిదాలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా సాంకేతికతను జోడించింది.

Published : 09 Dec 2022 05:09 IST

శారీరక సామర్థ్య పరీక్షల్లో కొత్త పంథా
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షల్లో నియామక మండలి పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఎలాంటి తప్పిదాలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా సాంకేతికతను జోడించింది. ప్రతి విభాగంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బందీ నిఘా ఉంచడంతో అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బయోమెట్రిక్‌ హాజరుతో  మొదలు

అభ్యర్థులు మైదానంలోనికి రావాలంటే అడ్మిట్‌ కార్డు తప్పనిసరి. ఆ తర్వాత హాజరును బయోమెట్రిక్‌ పద్ధతిలో తీసుకుంటున్నారు. వేలిముద్రలు, ఫొటో, కేటాయించే టోకెన్‌ నంబరును ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నారు.

పరుగులో  ఆర్‌ఎఫ్‌ఐడీ..

ట్రాక్‌లో పరుగు పెట్టే సమయంలో గుర్తించేందుకు వీలుగా ఆర్‌ఎఫ్‌ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్‌)ని వినియోగిస్తున్నారు. జాకెట్‌ రూపంలో ఉన్న ఆర్‌ఎఫ్‌ఐడీలను    అభ్యర్థులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అదనంగా  రిస్టు బ్యాండ్ల వినియోగంతో ఎంత సమయంలో పరుగు పూర్తి చేశారో కచ్చితమైన సమయం నిర్ధారణవుతోంది. దీనికితోడు ట్రాక్‌ వెంబడి సీసీ దృశ్యాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ఎత్తు, బరువు చెప్పే యంత్రం

ఎత్తు, బరువును కొలిచేందుకు గతంలో వేర్వేరుగా పరిశీలించేవారు. పరికరం వద్ద అభ్యర్థులు నిల్చుని ఉంటే ఎంత ఎత్తు అన్నది సిబ్బంది పరిశీలించి నమోదు చేసేవారు. ఈసారి ఆ విధానానికి స్వస్తి పలికారు. డిజిటల్‌ యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిపై అభ్యర్థి నిల్చుంటే ఎత్తు, బరువు ఒకేసారి తెరపై చూపుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా కెమెరాల్లో రికార్డవుతోంది.

తొలిరోజు 518 మంది  హాజరు

నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో మొదటిరోజు గురువారం 518 మంది అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 600 కిగాను 82 మంది గైర్హాజరైనట్లు సీపీ నాగరాజు తెలిపారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా.. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా విధిగా సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని