logo

కూలి పెంచితేనే ప్రయోజనం

సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం   నాటికి ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది.

Published : 28 Apr 2024 05:33 IST

మహిళా సంఘాలకు దుస్తులు కుట్టే బాధ్యత

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం   నాటికి ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా సర్కారు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులను అందజేస్తోంది. గతేడాది నుంచి దుస్తులు కుట్టే నమూనాను మార్చారు. దీంతో అనేక మంది పిల్లలకు ఒకే జత ఇచ్చారు. ఆరు నెలలు గడిచాక మరో జత పంపిణీ చేశారు. ఈ సారి మహిళా సంఘాల సభ్యులకు దుస్తులు కుట్టే బాధ్యతను అప్పగించారు. ఏళ్ల నుంచి తక్కువ ధరకే దుస్తులు కుట్టడంపై నిర్వాహకులు పెదవి విరుస్తున్నారు. ధర పెంచాలని డిమాండ్‌ ఉంది.

జిల్లాలో మహిళా సంఘాల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సంఘాలను దుస్తులు కుట్టేందుకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సభ్యులు వివిధ బడులకు వెళ్లి విద్యార్థుల కొలతల స్వీకరణ చేపట్టారు. సర్కారు నుంచి పిల్లలకు సంబంధించి వస్త్రం రాగానే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిద్ధం చేయనున్నారు. బడులు తెరుచుకునేనాటికి తొలి విడతలో ఒక జత దుస్తులను అందించాలని యంత్రాంగం భావిస్తోంది.

ధరలు సవరిస్తేనే

ప్రభుత్వ బడులతో పాటు కేజీబీవీ, ఆదర్శ, గురుకుల బడుల్లో చదువుతున్న విద్యార్థులు జిల్లాలో లక్షపైనే ఉన్నారు. ఒక్కో విద్యార్థికి దుస్తులు కుట్టేందుకు దర్జీ రుసుం రూ.50 చెల్లించనున్నారు. 1-3 తరగతుల బాలికలకు ప్రాక్‌తో కూడిన దుస్తులు, 4,5 తరగతుల బాలికలకు స్కర్ట్‌, 6-12వ తరగతుల వారికి పంజాబీ దుస్తులను కుట్టనున్నారు. బాలుర విభాగంలో 1-7వ తరగతి వరకు ఎరుపు, బూడిద రంగు చొక్కా, మెరూన్‌ రంగు చెడ్డీ, 8-12వ తరగతుల బాలురకు చొక్కా, ప్యాంటు అందించనున్నారు. గతేడాదే రుసుం పెంచాలని దర్జీల నుంచి డిమాండ్‌ అధికంగా వినిపించింది. ఈ సారి సైతం ఏళ్ల నుంచి ఇస్తున్న రుసుం కాకుండా పెంచాలని మహిళా సంఘాల సభ్యులు, దర్జీలు కోరుతున్నారు.


విద్యార్థులకు సౌలభ్యంగా : డీఈవో రాజు

విద్యాశాఖ నిర్దేశించిన నమూనాలో దుస్తులను కుట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. త్వరలో సర్కారు నుంచి వస్త్రం రాగానే కుట్టడానికి నిర్వాహకులకు అప్పగిస్తాం. అనేక చోట్ల మహిళా సంఘాల బాధ్యులకు దుస్తులు కుట్టే బాధ్యతలు ఇస్తున్నాం. ఈ సారి కొలతలు సక్రమంగా వచ్చేలా నిర్వాహకులు దృష్టి పెట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని