logo

లక్ష్యం శతశాతం

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్‌ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

Published : 19 May 2024 05:48 IST

ఇంటర్‌లో ప్రవేశాలు పెంచేందుకు కసరత్తు

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్‌ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ సారి శతశాతం ప్రవేశాల లక్ష్యం అధిగమించేందుకు దృష్టి పెట్టింది. జూన్‌ 1వ తేదీ నుంచి ఇంటర్‌ విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రవేశాలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది.
* గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ అనుబంధ కళాశాలలు, ఆదర్శ బడులు, గురుకులాలు, కసూర్బా బాలికల విద్యాలయాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో మండల కేంద్రాలకు, గ్రామాలకు అధ్యాపకులు వెళ్లి పిల్లల తల్లిదండ్రులను చైతన్యం చేయాలని నిర్ణయించారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. 

ఫలితాల ప్రభావం ఏ మేరకు..?

2023-24 విద్యాసంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 35వ స్థానానికి చేరింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం అధికారులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. 


ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలి
...షేక్‌ సలాం, డీఐఈవో

జిల్లాలో ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాలల్లోనే పిల్లలను చేర్పించాలి. అన్ని రకాల వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ఈ విద్యాసంవత్సరం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతాం. ఫలితాల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడొద్దు.

ఆదర్శలో 960 సీట్లు

సదాశివనగర్, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంలా మారాయి. ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన, అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, నిష్ణాతులైన అధ్యాపకులు ఉండటం, ఏటా ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో  ప్రవేశాలకు పోటీ నెలకొంది.www.tsmodel schools.com వెబ్‌సైట్‌లో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 
కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, బాన్సువాడ, మద్నూర్‌లో ఆదర్శ పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో ఇంటర్‌ ప్రథమసంవత్సంలో 160 సీట్ల చొప్పున మొత్తం 960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కొక్కదానిలో 40 సీట్లు చొప్పున 160 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. కళాశాలలో చేరిన వారిలో 100 మంది విద్యార్థినులకు ఉచిత హాస్టల్‌ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఇబ్బందులు తలెత్తకుండా కేర్‌టేకర్, ఏఎన్‌ఎం, నైట్‌వాచ్‌మెన్‌ అందుబాటులో ఉంటారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని