logo

పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్‌

బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు.

Updated : 19 May 2024 06:21 IST

మూడేళ్లుగా నిలిచిన రవాణా భత్యం

బడులకు చేర్చడంపై సందిగ్ధం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం మొదటిరోజే పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాలు అందేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చిన వాటిని జిల్లా కేంద్ర గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. మూడేళ్లుగా రవాణాభత్యం చెల్లించకపోవడంతో జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి చేర్చే గుత్తేదారులు  మొహం చాటేశారు. గతేడాది రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో మండల విద్యాశాఖాధికారులు సరఫరా చేశారు. ఈ ఏడాది ఇప్పటికే జిల్లా కేంద్రానికి 70 శాతం   మేర వచ్చాయి. వాటిని మండల, పాఠశాల స్థాయికి చేర్చడంపై దృష్టి సారించాల్సి ఉంది. 

ద్విభాష పుస్తకాలు

ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాల్లో ద్విభాష(బైలింగ్‌లెవల్‌) పుస్తకాలు ముద్రిస్తున్నారు. పార్ట్‌-1, 2 చొప్పున ఏడాదికి రెండుసార్లు పంపిణీ చేస్తున్నారు. రెండు మాధ్యమాల వారు చదువుకునే వీలుంది. రెండేళ్ల క్రితం తొలిసారిగా   3 నుంచి 8వ తరగతి వరకు సరఫరా చేశారు.  గతేడాది 9వ తరగతి, ప్రస్తుతం పదో తరగతి వరకు బైలింగ్‌వెల్‌ పుస్తకాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10,17,596 పాఠ్య పుస్తకాలు అవసరమని తేల్చారు. జిల్లా కేంద్ర గోదాంలో 1,40,026 నిల్వ ఉన్నాయి. పార్ట్‌-1 పుస్తకాలు 6,37,127 రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 4.49 లక్షలు వచ్చాయి. వారం రోజుల్లో శతశాతం వస్తాయని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబరులో పార్ట్‌-2 పంపిణీ చేస్తారు. 

ముందుకు రాని ఏజెన్సీలు

జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి పాఠ్యపుస్తకాలు చేర్చేందుకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లించేవారు. తక్కువ ధరకు కోడ్‌ చేసినవారితో సరఫరా చేయించేవారు. సదరు ఏజెన్సీకి మూడేళ్లుగా ప్రభుత్వం ఛార్జీలు విడుదల చేయలేదు. ఏజెన్సీ ముందుకు రాకపోవడంతో గతేడాది అధికారులు ఎంఈవోల సాయంతో చేర్చారు. కొందరు ఎంఈవోలు సొంతంగా సమకూర్చగా.. కొందరు కాంప్లెక్స్‌ల నుంచి వసూలు చేశారు. మండల కేంద్రానికి చేర్చేందుకు రూ.7 వేలకు పైగా వెచ్చించినట్లు, దూరాన్నిబట్టి మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ సారి సొంతంగా నిధులు వెచ్చించే పరిస్థితి లేదని ఎంఈవోలు పేర్కొంటుండటంతో సరఫరా సందిగ్ధంలో పడింది.


ఆదేశాల మేరకు నడుచుకుంటాం
- దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్‌

పాఠ్యపుస్తకాల సరఫరా వేగంగా సాగుతోంది.  ఇప్పటికే 70 శాతం వచ్చాయి. మరో వారంలో మిగతావి వచ్చే అవకాశముంది. మండల కేంద్రాలకు చేర్చే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వారి ఆదేశాల మేరకు  వచ్చే వారంలో సరఫరా ప్రారంభిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని