logo

జయపురంలో శంఖం పూరించేదెవరు?

బిజద రెండుసార్లు అభ్యర్థుల జాబితా విడుదల చేసినా ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం జయపురానికి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

Published : 08 Apr 2024 06:48 IST

జయపురం, న్యూస్‌టుడే: బిజద రెండుసార్లు అభ్యర్థుల జాబితా విడుదల చేసినా ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం జయపురానికి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధిష్ఠానానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆశావహులు తమ మద్దతుదారులతో భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద టికెట్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జయపురం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.  

బరిలో సీనియర్‌ నేత

బిజద సీనియర్‌ నేత, మాజీ మంత్రి రబినారాయణ నందొ బరిలో ముందంజలో ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, 2000-04లో ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ, 2004-09లో జలవనరులు, 2009-14లో స్కూల్‌, మాస్‌ ఎడ్యుకేషన్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఓటమి పాలయ్యారు. ఈసారి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు హామీ ఇస్తున్నారు. కొరాపుట్‌ కేసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఈశ్వర్‌చంద్ర పాణిగ్రహి కూడా రేసులో ఉండడంతో ఉత్కంఠ పెరిగింది. 2000లో కొరాపుట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 2018లో జిల్లా బిజద అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రైతులు తనకు మద్దతు ఇస్తున్నారని, టికెట్ ఇస్తే విజయశంఖం పూరిస్తానంటున్నారు.

మహిళలకు ప్రాధాన్యం

ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్న కొంతమందికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లా మహిళా అధ్యక్షురాలు డా।।ఇందిరానందో ఈ నియోజకవర్గం ఆశావహుల్లో ఒకరు. ఈసారి తనకు టికెట్‌ దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేసులో మరో అభ్యర్థి సుభాష్‌ రౌత్‌ ఉన్నారు. ఏడాది క్రితం రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. రబీ నారాయణకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అంటున్నారు. అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందో త్వరలో విడుదల చేయనున్న బిజద మూడో జాబితా కోసం వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని