logo

కొరాపుట్‌ లో త్రిముఖ పోరు

పదిహేనేళ్ల కిందటి వరకు కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన కొరాపుట్‌ లోక్‌సభ స్థానంలో గతకొంత కాలంగా బిజద, కాంగ్రెస్‌లు నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి

Published : 10 Apr 2024 06:53 IST

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: పదిహేనేళ్ల కిందటి వరకు కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన కొరాపుట్‌ లోక్‌సభ స్థానంలో గతకొంత కాలంగా బిజద, కాంగ్రెస్‌లు నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తాజా పరిణామాలతో ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు కమలం(భాజపా) సైతం ధీటుగా పోటీనిస్తుండడంతో త్రిముఖ పోటీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో కేవలం 9 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న భాజపా 2019 నాటికి 19 శాతం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత గడిచిన ఐదేళ్లలో కొరాపుట్‌ లోక్‌సభ స్థానం పరిధిలో కాషాయం పార్టీ తన ఉనికిని మరింత చాటుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఈ స్థానానికి కాంగ్రెస్‌ బిజదతోపాటు కమల దళం నుంచి గట్టిపోటీ ఎదురుకానుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 1957లో ఏర్పడిన కొరాపుట్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన విషయం తెలిసిందే. తొలిసారిగా 1972లో కాంగ్రెస్‌ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన గిరిధర్‌ గమాంగ్‌, ఆ తరువాత ఏకధాటిగా మరో ఎనిమిది సార్లు ఈ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌కు తిరుగులేదన్న ముద్ర ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీగా తెరమీదకు వచ్చిన బిజద 2009లో ఈ స్థానాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. బిజద తరఫున బరిలోకి దిగిన జయరాం పంగి, గిరిధర్‌ గమాంగ్‌పై గెలుపొందారు. ఆ తరువాత 2014లోనూ జీనూ హిక్కాక (బిజద) గెలుపొందడంతో ఇకపై కొరాపుట్‌ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కు కష్టమే అన్న అభిప్రాయాలు అప్పట్లో కలిగాయి. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ 2019లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన సప్తగిరి ఉలక ఈ పీఠాన్ని దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలిగింది.

 రెండు ర్గాలుగా బిజద

మరోవైపు బిజదకు ఇక్కడ మంచి ఉనికి ఉన్నప్పటికీ, చిన్నచిన్న పొరపాట్లు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాయగడలో ఇప్పటికే బిజద రెండు వర్గాలుగా చీలి బేదాభిప్రాయాలు తారస్థాయికి చేరుకోవడంతోపాటు తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఏమేర ప్రభావం చూపుతాయో అన్న సందేహాలు కలుగుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్చిన అధిష్ఠానవర్గం నిర్ణయానికి రెండు వర్గాలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయో అన్న అనుమానాలు రేగుతున్నాయి. దీనికితోడు భాజపా నుంచి జాతీయ స్థాయిలో ఆ పార్టీ ముఖ్య నేతల మన్ననలు పొందిన కాళీరాం మాఝి కమల దళం తరఫున బరిలోకి దిగుతుండడంతో ఇటు కాంగ్రెస్‌, అటు బిజదలకు గట్టి పోటీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఉన్నత విద్యావంతుడైన కాళీరాం 2008 నుంచి పార్టీలో కొనసాగుతూ భాజపా ఎస్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత స్థాయిలో భాజపాకు అంతగా ఉనికి లేకపోవడం ప్రతికూలంశంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఈసారి ఏమవుతుందో

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో సప్తగిరి ఉలక చేతిలో ఓడిన బిజద అభ్యర్థి కౌసల్య హిక్కాకకు ఆ పార్టీ అధిష్ఠానం మరోసారి అవకాశమిచ్చింది. అయితే కొరాపుట్‌ లోక్‌సభ స్థానం పరిధిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటు, గుణుపురం - తెరువలి రైల్వేలైను, జోడియాలను ఆదివాసీలుగా గుర్తించడం, తాగునీటి సమస్య తదితర వాటిపై పార్లమెంట్‌లో గళం విప్పి, ఎంతోమంది మన్ననలు పొందిన ఉలకను ఓడించడం అంత సులభంకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొరాపుట్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలతో ఉలకాకు ఏర్పడిన భేదాభిప్రాయాలు ప్రతికూలంగా మారే అవకాŒం విశ్లేషకులు చెబుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని